అలిపిరి నడక మార్గంలో గత నెల 11న చిరుత దాడిలో మృతి చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని టీటీడీ అధికారులు చెల్లించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బాలిక లక్షిత.. తన తల్లిదండ్రులు వెంకట దినేష్, శశికళతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమలకు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించినట్టు సోమవారం లక్షిత తల్లిదండ్రులకు టీటీడీ నుంచి రూ.5 లక్షలు, ఏపీ అటవీశాఖ నుంచి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు, తిరుపతి డీఎఫ్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
చిరుత దాడిలో మృతిచెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి రూ.15లక్షల పరిహారం ఇచ్చామని టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు తెలపగా.. మరో రూ.15లక్షలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తిరుమల నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు గతవారం ఈ సూచనలు చేసింది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు రక్షణ కల్పించాల్సిన టీటీడీ.. వారికి కర్రలు ఇస్తామన్న ప్రకటనపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే.
దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన లాయర్.. వన్య ప్రాణుల కదలికలకు అవసరమైతే అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. భక్తుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని ఆదేశించింది.
మరోవైపు, లక్షిత చిరుత చంపేసిందని ఒకసారి.. కాదు ఎలుగబంటి చంపేసిందని మరోసారి వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం అనంతరం అసలు విషయం బటయపడింది. నడకదారిలో పాపపై దాడి చేసింది చిరుత పులేనని పోస్టుమార్టంలో స్పష్టమైంది. ఎస్వీ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగం లక్షితను చంపింది చిరుతేనని నిర్దారించింది. పాపను చంపి శరీరంలోని భాగాలను చిరుత తిని వెళ్లిపోయిందని పోస్టుమార్టంలో తేలింది. ఆ తర్వాత శవాన్ని మరేదైనా జంతువు తిని ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. పాప ప్రాణం పోవడానికి మాత్రం చిరుతే కారణమని స్పష్టం చేశారు. కాగా, మరోవైపు ఈ ఘటనపై బాలల హక్కుల కమిషన్ కూడా స్పందించింది. తమకు పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని టీటీడీని హక్కుల సంఘం ఆదేశించింది.