గోదారోళ్ల మర్యాదలు ఓ రేంజ్‌లో ఉంటాయి. గోదావరి జిల్లాలకు అల్లుడిగా వెళ్తే.. ఆ భోగమే వేరే. ఇక కొత్తల్లుడు సంక్రాంతి పండగకు అత్తారింటికి వెళ్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో చాలా సందర్భాల్లో గోదారోళ్లు కొత్త అల్లుడికి మర్యాదలు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అల్లుడికి రకరకాల వంటకాలతో అత్తగారు కొసరి కొసరి వడ్డిస్తుండటం చూస్తే ఏ కుర్రాడైనా సరే.. గోదారి జిల్లాలకు అల్లుడైపోవాలని అనుకోక మానడు. గోదారి ప్రజల మర్యాదలు అలా ఉంటాయి మరి.
అల్లుడికే కాదు.. కోడలికి కూడా మా మర్యాదలు అదే రేంజ్‌లో ఉంటాయని గోదారోళ్లు నిరూపించారు. కాబోయే కోడలిపై అత్తింటి వారు స్వీట్ల రూపంలో తమ ప్రేమనంతా గుమ్మరించారు. రాజమండ్రిలో జరిగిన నిశ్చయ తాంబులాల వేడుకలో.. పెళ్లి కూతురు తరఫున వారికి 108 రకాల స్వీట్లు ఇచ్చారు. మున్నం, ప్రగడ కుటుంబాల ఎంగేజ్‌మెంట్‌కెళ్లిన వారికి స్వీట్లలో ఇన్ని రకాలు ఉంటాయా? ఇన్ని ఆకారాల్లో స్వీట్లు చేయొచ్చా? అని అనిపించిక మానదు.
కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు.. ఇలా ఒకటేమిటి.. ఆ స్వీట్ల పేరు కనుక్కోవడానికే ఓ పూట సరిపోతుందనేంతలా.. రకరకాల స్వీట్లతో చూస్తేనే కడుపు నిండేలా చేశారు. ఎంగేజ్‌మెంట్ కోసం ఐదో లేదంటే పది రకాల స్వీట్లు తీసుకెళ్లడం కామన్. కానీ మరీ 108 రకాల స్వీట్లేంటండీ బాబు అని జనం అనుకుంటున్నారు. అనీష్, లేఖ ఎంగేజ్‌మెంట్ కోసం 108 రకాల స్వీట్లు చేయించామని.. గోదావరి జిల్లాల సంప్రదాయాన్ని రాబోయే తరాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో ఇలా చేశామని వరుడి తండ్రి తెలిపారు. ఇప్పటికే చాలా మంది సంప్రదాయాన్ని మర్చిపోతున్నారన్నారు. స్వీట్లన్నీ తామే ప్యాకేజింగ్ చేశామని వరుడి కజిన్ తెలిపారు.