స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22వ తేదీ వరకు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో.. బాబును భారీ పోలీసు భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించనున్నారు. కాగా.. ఉదయం నుంచి ఎలాంటి తీర్పు వెలువడుతుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా ఏపీ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. ఈ క్రమంలో.. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వటంతో.. వైసీపీ మంత్రి రోజా సంతోషం వ్యక్తం చేశారు. ఆమె సొంత నియోజకవర్గమైన నగరిలో పటాసులు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలకు స్వీట్లు పంచి.. నోళ్లు తీపి చేశారు.
అయితే.. ప్రతి ఒక్కరి తప్పులను పైనున్న దేవుడు చూస్తూనే ఉంటాడని.. వాళ్లకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష విధిస్తాడని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి రోజా. కాగా.. తనను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసి.. తన కన్నీటికి కారణమైన చంద్రబాబుకు తన శాపం తగిలిందంని చెప్పుకొచ్చారు రోజా. అయితే.. తాను చేసిన అవినీతికి ఎప్పుడో అరెస్ట్ కావాలని.. కానీ ఇప్పుడే అరెస్ట్ కావాలని దేవుడు ముహూర్తం పెట్టడానికి కారణముందని వివరించారు. ఈ వయసులో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి.. ఆయనపైకి చెప్పులను విసిరించి.. మానసిక క్షోభకు కారణం కాగా.. అదే వయసులో ఉన్న చంద్రబాబుకు శిక్ష పడితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియజేయాలని దేవుడు డిసైడ్ అయ్యాడని రోజా చెప్పుకొచ్చారు.
ఇక.. చంద్రాబుకు ఆరంభం మాత్రమేనని.. ఆయన జైలు నుంచి బయటకు రాలేడంటూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం మాత్రమేనని.. ఇంకా అమరావతి భూ కుంభకోణం లాంటి పెద్ద పెద్ద స్కాంలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇవన్నీ బయటకు వస్తే.. ఇక బాబుకు జైలు జీవితమే అంటూ విమర్శించారు రోజా. చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో ఏపీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓవైపు వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుండగా.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. రోడ్డు మీదికొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.