జీ20 శిఖారాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించిన భారత్.. అడుగడుగునా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా ఘనంగా ఏర్పాట్లు చేసింది. భారత్‌లోని విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, కళారూపాలు.. జీ20 సమావేశాల్లో ప్రతిబింబించాయి. ఈ క్రమంలోనే జీ20 సదస్సుకు వేదికైన భారత్ మండపం వద్ద ఏర్పాటు చేసిన కోణార్క్ చక్రం.. అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ కోణార్క్ చక్రం ముందు నిలబడి.. జీ20 దేశాల అధినేతలు, ఇతర ప్రపంచ సంస్థల అధ్యక్షులు, ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. వారికి ఆ కోణార్క్ చక్రం విశిష్ఠతను తెలియజెప్పారు. కోణార్క్ చక్రానికి ఒక వైపు జీ20 ఇండియా 2023 అని.. మరొక వైపు వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అని రాసి ఉంది.
జీ20 సమావేశాలు నిర్వహిస్తున్న ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం వద్ద ఒడిశాలోని సూర్య దేవాలయంలో ఉన్న కోణార్క్ చక్రం లాంటి నమూనాను ఏర్పాటు చేశారు. ఈ కోణార్క్ చక్రం జీ20 దేశాధినేతలను ఎంతగానో కట్టిపడేసింది. ఆ కోణార్క్ చక్రం వద్ద నిలబడిన ప్రధాని నరేంద్ర మోదీ.. అతిథులను ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆ కోణార్క్ చక్రానికి సంబంధించిన చరిత్రను వివరించారు. అయితే ఈ కోణార్క్ చక్రాన్ని 13 వ శతాబ్దంలో రాజా నరసింహదేవ్ 1 పాలనలో నిర్మించారు. ఇలాంటి కోణార్క్ చక్రాలు ఒడిశాలోని సూర్య దేవాలయంలో 24 ఉన్నాయి. భారత ప్రాచీన విజ్ఞాన సంపద, నాగరికత శిల్ప కళకు గుర్తుగా కోణార్క్ చక్రాన్ని అభివర్ణిస్తారు. ఈ కోణార్క్ చక్రం భ్రమణం కాల చక్రంలో నిరంతర పురోగతి, మార్పును సూచిస్తుందని చెబుతారు.
భారత కరెన్సీ నోట్లపై కూడా ఈ కోణార్క్ చక్రం ముద్రిస్తారు. ఒకప్పుడు రూ. 20, రూ.10 నోటుపై ప్రింట్ చేసి ఉంటుంది. ఈ కోణార్క్ చక్రంలో 8 వెడల్పు గీతలు, 8 సన్నని గీతలు ఉంటాయి. ఇవి సూర్యుని రథ చక్రాలను సూచిస్తాయని చెబుతారు. 8 గీతలు రోజులోని 8 గంటలను సూచిస్తాయని.. వీటి ద్వారా సూర్యుని స్థానం ఆధారంగా సమయం లెక్కిస్తారు. ఈ చక్రం 9 అడుగుల 9 అంగుళాల పరిమాణం ఉంది. ఈ కోణార్క్ చక్రంలోని 12 జతల చక్రాలు ఒక ఏడాదిలోని 12 నెలలను సూచిస్తాయని.. 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని చరిత్ర కారులు చెబుతారు. ఈ క్రమంలోనే భారత సంస్కృతిని చాటి చెప్పేలా ఎన్నో ఏర్పాట్లు చేశారు.