ఇండియా పేరును తొలగిస్తారా. ఇండియా స్థానంలో భారత్ అని మారుస్తారా అని దేశంలో ప్రస్తుతం చర్చ జరుగుతున్న వేళ.. తాజాగా ఓ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇండియా అని పేరు ఉన్న స్థానంలో భారత్ అని రాయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్ ఎంపీ దిలీప్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరు భారత్‌గా మారుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఇండియా పేరు భారత్‌గా మారడం ఇష్టం లేని వారు దేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్లవచ్చని సూచించారు.
మేదినీపూర్ నియోజకవర్గంలోని ఖరగ్‌పూర్‌లో నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా ఎంపీ దిలీప్ ఘోష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశం పేరు ఇండియా నుంచి భారత్ అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే దీన్ని విమర్శించేవారు.. భారత్ అని పేరు పెట్టడం ఇష్టం లేని వారు నిరభ్యంతరంగా దేశాన్ని విడిచి ఇతర దేశాలకు వెళ్లిపోవచ్చని హితవు పలికారు. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే కోల్‌కతాలో ఉన్న విదేశీయలకు చెందిన విగ్రహాలను తొలగిస్తామని దిలీప్ ఘోష్ వెల్లడించారు.
మరోవైపు.. అదే రాష్ట్రానికి చెందిన మరో బీజేపీ నేత రాహుల్ సిన్హా కూడా భారత్ పేరు మార్పు వ్యవహారంపై స్పందించారు. ఒక దేశం రెండు పేర్లు కలిగి ఉండకూడదన్న రాహుల్ సిన్హా.. పేరు మార్చేందుకు ఇదే సరైన సమయం అని వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన జీ20 సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు హాజరయ్యారని భారత్ పేరు మార్పుకు ఇదే కరెక్ట్ టైమ్ అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై తృణముల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శాంతనూ సేన్ కూడా మాట్లాడారు. ఇండియా కూటమికి బీజేపీ భయపడుతోందని.. అందుకే దేశంలో ప్రస్తుతం నెలకొన్న అనేక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే దేశం పేరు మార్పుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ దేశంలో మాత్రం గత కొన్ని రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతోంది. అయితే దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. జీ20 దేశాధినేతలకు ఇచ్చే విందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం అందించిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో భారత్ అని ప్రచురించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ తర్వాత రోజే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన ప్రకటనలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని ప్రచురించడం ఇండియా పేరును భారత్‌గా మార్చుతున్నారన్న ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. మరోవైపు.. జీ20 సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూర్చునే స్థానంలో కూడా గతంలో ఇండియా అని రాసి ఉండగా.. ఈసారి మాత్రం భారత్ అని రాశారు.