భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ20 సమావేశాలు ముగిశాయి. ఈసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న భారత్.. ఈ జీ20 శిఖరాగ్ర సదస్సును విజయవంతం చేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జీ20 శిఖరాగ్ర సమావేశాల అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు భారత్ అందించింది. జీ20 కూటమిని విస్తరించి ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చుకోవడం, ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం కల్పించడం.. వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో భారత్ సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. ఈ క్రమంలోనే అధికారికంగా జీ20 అధ్యక్ష బాధ్యతలను అప్పగించే ప్రక్రియ కూడా పూర్తయింది. అధ్యక్ష బాధ్యతల అప్పగింతలో భాగంగా బేటన్ లాంటి గవెల్‌ను బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన అంశాలను చేర్చినందుకు భారత్‌కు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా ధన్యవాదాలు తెలిపారు.
జీ20 సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు ఉపన్యాసం చేశారు. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా శనివారం రోజు వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్‌కు సంబంధించిన విషయాలపై విస్తృత స్థాయిలో చర్చించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మోదీ వెల్లడించారు. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్‌కు జీ20 సమావేశాలు వేదిక కావడం తనకు సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై జీ20 కూటమి దేశాలు చర్చించాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితిలో చేయాల్సిన సంస్కరణలపైనా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించడం గమనార్హం.
ఈ సందర్భంగా భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశాలకు సంబంధించి ప్రధాని మోదీని బ్రెజిల్ అధ్యక్షుడు ప్రశంసలతో ముంచెత్తారు. సామాజిక అంశాలైన ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, ఇంధన పరివర్తన, సుస్థిర అభివృద్ధిని జీ20 ప్రాధాన్యతలు చేర్చడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో తీసుకురావాల్సిన మార్పులను ప్రధాని మోదీ ప్రస్తావించడం అభినందనీయమని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐరాసలో శాశ్వత సభ్యత్వం అందిస్తే.. తాత్కాలిక సభ్యదేశాలు కూడా రాజకీయంగా బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్ వద్ద మరింత ప్రాతినిధ్యం కోరుకుంటున్నట్లు లులా డా సిల్వా వివరించారు.
అంతర్జాతీయ పెరుగుతున్న విశ్వాస లోపానికి ముగింపు పలకాలని ఈ జీ20 సదస్సులో చర్చించడం మరో పెద్ద విజయమని పేర్కొన్నారు. ఈ క్రమంలనే అంతర్జాతీయ జీవఇంధన కూటమిని ఏర్పాటు చేయడం వల్ల అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాల మధ్య కొత్త సంబంధాలకు ఆరంభమని ప్రధాని మోదీ చెప్పారు. ఇక జీ20 దేశాలన్నీ ఏకగ్రీవంగా ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం ఇవ్వడం అనేది ప్రాదేశిక సమగ్రత.. అంతర్జాతీయంగా శాంతి, సుస్థిరత సాధించేందుకు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని అన్ని దేశాలు ఆమోదించినట్లేనని స్పష్టం చేశారు.
అయితే ఈ క్రమంలోనే పలు అంశాలతో జీ20 సమావేశాల మొదటి రోజే ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. రష్యా, చైనా అధినేతల గైర్హాజరీలోనూ ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం కల్పించడం మరో విశేషం. ఈ సందర్భంగా 2030 నాటికి అంతర్జాతీయ పునరుత్పాదక శక్తి సామర్థ్యాలను మూడింతలు చేయాలని జీ20 సభ్య దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఆయా దేశాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బొగ్గును దశల వారీగా తగ్గించే ప్రయత్నాలు చేయాలని నిర్ణయించాయి. అయితే ఆయిల్, గ్యాస్ సహా అన్ని శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించడానికి ఎలాంటి ప్రకటనలు తీసుకోలేందు.