ఢిల్లీ వేదికగా జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో ప్రోటోకాల్ ఉల్లంఘన కలకలం రేగింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్‌లోని ఓ వాహనం.. సౌదీ యువరాజు మొహమూద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ బస చేసిన హోటల్‌లోకి ప్రవేశించింది. శనివారం ఉదయం తాజ్ హోటల్ వద్ద జరిగిన ఈ ఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రోటోకాల్ ఉల్లంఘనతో ఆందోళనకు గురయ్యారు. కానీ, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. బైడెన్ ఉన్న హోటల్‌కి వెళ్లే ముందు ఇతర కస్టమర్‌ల తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.
జీ 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ బస చేసిన ఐటీసీ మౌర్య వద్దకు ఉదయం 9.30 గంటలకు తనను రమ్మన్నట్టు అతడు పోలీసులకు చెప్పాడు. దీంతో సమయం ఉండటం వల్ల ఉదయం 8 గంటలకు తాజ్ హోటల్‌లో మరో కస్టమర్ కోసం వచ్చినట్టు వివరించాడు. హోటల్ తాజ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఆ వాహనం ఆపినప్పుడు ఓ వ్యాపారవేత్త అందులో ఉన్నారు. అంతేకాదు, తనకు ప్రోటోకాల్ నిబంధనల గురించి తెలియదని డ్రైవర్ చెప్పడంతో పోలీసులు అతడ్ని వదిలిపెట్టారు.
అయితే, ఆ వాహనాన్ని బైడెన్ కాన్వాయ్ నుంచి తప్పించారు. జీ 20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రపంచ దేశాధినేతలు హాజరుకావడంతో ఢిల్లీలో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి.. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీలను కూడా నిషేధించారు. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంచి, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. ప్రపంచ దేశాధినేతలు తరలి రావడంతో ఢిల్లీ నగరం రెండు రోజుల పాటు భద్రతవలయంలోకి వెళ్లిపోయింది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు.
యుద్ధ విమానాలు, డ్రోన్లు, పారా మిలటరీ దళాలను మోహరించారు. జీ 20 సదస్సును దృష్టిలో పెట్టుకొని సుమారు 300 రైళ్లను కూడా రైల్వే రద్దు చేసింది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సదస్సు విజయవంతమైంది. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. గతేడాది ఇండోనేషియా వేదికగా జరిగిన జీ 20 సదస్సులో ఉక్రెయిన్ సంఘర్షణ విషయమై విబేధించిన రష్యా, చైనాలు.. ఈసారి మాత్రం ఏకీభవించాయి. ఏకాభిప్రాయం కోసం భారత్ చేసిన ప్రయత్నం ఫలించింది. ఈ విషయంలో జీ 20 షెర్పా అమితాబ్ కాంత్ కీలకంగా వ్యవహరించారు.