ప్రపంచ వ్యాప్తంగా మహాత్మాగాంధీకి ఉన్న ఖ్యాతి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదిలావుంటే ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా రెండో రోజు దేశాధినేతలు రాజ్ ఘాట్ ను సందర్శించారు. గాంధీ సమాధిపై పుష్పగుష్పం ఉంచి నివాళులు అర్పించారు. ఉదయమే భారత్ మండపం నుంచి బయలుదేరి రాజ్ ఘాట్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వారికి స్వాగతం పలికి, స్వయంగా తోడ్కొని వెళ్లారు. మహాత్ముడి సమాధి వద్ద అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్, తుర్కియే ప్రెసిడెంట్ రికాప్ తయ్యిప్ ఎర్డొగాన్ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం దేశాధినేతలంతా తిరిగి భారత్ మండపానికి బయలుదేరారు. సమిట్ లో భాగంగా నేడు (ఆదివారం) ప్లాంటేషన్ సెర్మనీకి హాజరుకానున్నారు. జీ20 సమిట్ తొలిరోజు శనివారం నాడు ఢిల్లీ డిక్లరేషన్ కు సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపాయి. దీంతో పాటు అమెరికా, ఇండియా, సౌదీ అరేబియా, యూరోప్ లను కలుపుతూ మెగా రైల్, పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించిన మెగా ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరింది. జీ20లోకి శాశ్వత సభ్య దేశంగా ఆఫ్రికా యూనియన్ ను మోదీ స్వాగతించగా.. మిగతా సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. దీంతో జీ20 సభ్య దేశాల సంఖ్య 21కి చేరింది.