అక్రమాలు చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోవచ్చని, స్టేలు తెచ్చుకుని శిక్ష నుంచి తప్పించుకోవచ్చని చంద్రబాబు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చాడని, కానీ నేటితో ఆ భ్రమలు వీడిపోయాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎవరైనా చట్టానికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోనే పాలన సాగించాల్సి ఉంటుందని కోర్టు తీర్పుతో నేడు మరోమారు నిరూపితమైందని చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశముందని, ఆయనపై ఇంకా 6 లేదా 7 ట్రయిలబుల్ (ప్రాసిక్యూషన్ ) కేసులు ఉన్నాయన్నారు.