సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి.. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. కొంత మంది ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలను సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై వివిధ పార్టీలు, ధార్మిక సంస్థల నుంచి హెచ్చరికలు, బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇక ముఖ్యంగా బీజేపీ అగ్రనేతల నుంచి చాలా మంది నాయకులు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కేంద్ర మంత్రి వర్గ భేటీలో ప్రధాని మోదీ కూడా ఈ అంశం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే వారి నాలుకలు పీకేస్తామని గజేంద్ర సింగ్ షెకావత్ ఘాటు హెచ్చరికలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరైనా తక్కువ చేసి చూస్తే వారి కళ్లు పీకేస్తామని పేర్కొన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా రాజకీయంగా వారు ఎదగలేరని గజేంద్ర సింగ్ షెకావత్ విమర్శించారు. రాజస్థాన్‌లో పర్యటించిన గజేంద్ర సింగ్ షెకావత్.. బర్మర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. మన పూర్వీకులు వారి జీవితాలను ఫణంగా పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడారని.. అయితే దాన్ని ఇప్పుడు కొందరు వ్యక్తులు నిర్మూలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని ఇక ఏ మాత్రం వదిలిపెట్టేది లేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు.. సనాతన ధర్మంపై వ్యతిరేకంగా మాట్లాడే వారిపై బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా కూడా స్పందించారు. సనాతన ధర్మాన్ని అంతం చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడిన వారు హీరోలు కారని.. విలన్లు అవుతారని.. ప్రకాష్ రాజ్, ఉదయనిధి స్టాలిన్‌లను ఉద్దేశించి సాధ్వీ ప్రగ్యా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, కరోనాలతో పోల్చారు. ఇలాంటి వాటిని కేవలం వ్యతిరేకిస్తే సరిపోదని.. మొత్తం నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అయినప్పటికీ వెనక్కి తగ్గని ఉదయనిధి స్టాలిన్.. కుల, మత వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.