కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు పిలుపునిచ్చింది. ఈనెల 18 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పేర్కొంది. అయితే ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఏం చర్చిస్తారు.. అసలు ఎజెండా ఏంటి అన్నది మాత్రం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే రకరకాల ఊహాగానాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సంచలన కామెంట్లు చేశారు. ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం.. ముంబై నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ముంబైలో ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలను గుజరాత్ రాష్ట్రానికి తరలించేందుకు కేంద్రం సిద్ధమైందని ఆరోపించారు.
నోట్ల రద్దు, మణిపూర్ హింస, కరోనా మహమ్మారి వంటి సమయంలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించని.. మోదీ సర్కార్.. ఇప్పుడు పెట్టడానికి గల కారణం ఏంటని నానా పటోలే మండిపడ్డారు. మహారాష్ట్ర నుంచి ముంబైని విడదీసేందుకే ఈ సమావేశాలు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముంబై ఒక అంతర్జాతీయ నగరం.. దేశ ఆర్థిక రాజధాని అన్న నానా పటోలే.. అలాంటి ముంబై నగరం నుంచి ప్రస్తుతం ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ , డైమండ్ మార్కెట్ వంటి ఎన్నో పవర్ హౌస్‌లను తరలించే యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు వ్యతిరేకంగా చేస్తున్న చర్యలను తాము ఏ మాత్రం సహించబోమని నానా పటోలే హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి వాటికి గతంలో అధికారంలో ఉన్న శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం వ్యతిరేకించి.. కేంద్రం చర్యలను అడ్డుకుందని గుర్తు చేశారు. దీంతో తాజాగా ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ పని చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.
ఈనెల 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపిన కేంద్రం.. ఎందుకు నిర్వహిస్తున్నామన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో దేశవ్యాప్తంగా రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. జమిలీ ఎన్నికల కోసమేనని కొందరు.. దేశం పేరు మార్చుతున్నారని మరికొందరు.. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు పెడతారని ఇంకొందరు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఊహాగానాలకు తెర లేపుతున్నారు. అయితే ప్రత్యేక సమావేశాల ఎజెండాను నిబంధనల ప్రకారం వెల్లడిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా.. ఇప్పటివరకు అయితే ఎలాంటి సూచనలు చేయలేదు.