వచ్చే వారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండగా.. లోక్‌సభ, రాజ్యసభలో విధులు నిర్వర్తించే సిబ్బంది యూనిఫామ్ సహా పలు మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. చట్టసభ విధుల్లో నిమగ్నమైన వారికి క్రీమ్ కలర్ జాకెట్లు, గులాబీ రంగు కలువలతో ఉన్న క్రీమ్ షర్టులు, ఖాకీ ప్యాంటును యూనిఫామ్‌గా నిర్ణయించారు. ఉభయ సభల సిబ్బందికి ఒకే రకమైన యూనిఫాం ఉంటుంది. ఛాంబర్ అటెండెంట్లు, వెర్బేటిమ్ రిపోర్టింగ్ సర్వీస్ సిబ్బంది సహా మొత్తం 271 మందికి కొత్త యూనిఫాంలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతా విధులు నిర్వర్తించే పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ (ఆపరేషన్స్)కి చెందిన భద్రతా అధికారులకు బ్లూ సఫారీ సూట్‌కు బదులుగా సైన్యం ధరించ ఆలీవ్ రంగు దుస్తులను ధరిస్తారని పేర్కొన్నారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ డిజైన్‌లను రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యూనిఫాం అందరికీ ఒకేలా ఉంటుందని పేర్కొన్నాయి. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబరు 6న అర్హులైన అధికారులు, సిబ్బంది అందరికీ యూనిఫామ్ అందజేశారు. వాస్తవానికి నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పుడే ఈ యూనిఫాంను ఆవిష్కరించాలని భావించినా జాప్యం వల్ల కుదరలేదు. ఇక, సెప్టెంబరు 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. మొదటి రోజున ప్రస్తుత భవనానికి వీడ్కోలు పలికి.. నూతన పార్లమెంట్ భవనంలో యాదృచ్ఛికంగా సెప్టెంబరు 19న వినాయక చవితి రోజు నుంచి సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. గణపతి పూజ కూడా నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మొదటి రోజు ఉభయ సభలు స్వాతంత్య్రానికి ముందు.. తరువాత పాత పార్లమెంటు భవనం పాత్ర, ప్రాముఖ్యతపై చర్చించవచ్చని వర్గాలు తెలిపాయి. మర్నాడు కొత్త భవనానికి కార్యకలాపాలను మార్చడానికి ముందు సెంట్రల్ హాల్‌లో సంయుక్త సమావేశం ఉంటుందని అంటున్నాయి.