జమ్మూ కశ్మీర్‌లో 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆర్య సమాజ్ పాఠశాల పునఃప్రారంభమైంది. 90వ దశకంలో జమ్మూ కశ్మీర్‌లో వేర్పాటువాద మిలిటెన్సీ విజృంభించడంతో శ్రీనగర్‌లో ఆర్య సమాజ్ ట్రస్ట్ స్కూల్ మూతబడింది. పాఠశాలను మూసివేయడంతో ఓ స్థానికుడు ఈ భవనాన్ని స్వాధీనం చేసుకుని.. నష్కబందీ పబ్లిక్ స్కూల్ పేరుతో ఓ ప్రయివేట్ విద్యా సంస్థను ఏర్పాటు చేశాడు. దీనిపై ఆర్య సమాజ్ సుదీర్ఘ న్యాయపోరాటం సాగించగా.. ఓ వ్యాపారవేత్త సాయంతో తిరిగి భవనాన్ని స్వాధీనం చేసుకుంది. గతేడాదది జమ్మూ కశ్మీర్ విభాగం ఆర్య సమాజ్ ట్రస్ట్ ఛైర్మన్ అరుణ్ చౌదరికి అధికారులు అప్పగించారు.
దీంతో ప్రయివేట్ పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చివరకు అధికారుల జోక్యంతో సమస్య పరిష్కారమైంది. సరాఫ్ కాదల్ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు చెందిన 35 మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. కొంతమంది తల్లిదండ్రులు స్వచ్ఛందంగా నెలకు రూ. 500 విరాళంగా ఇస్తుండగా.. ఎటువంటి రుసుము వసూలు చేయరు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అందజేసే సాయం పాఠశాల కొనసాగించడానికి సహకరిస్తుంది.
ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌గా లక్నోకు చెందిన ఆమెను నియమించారు. ఈ ప్రయత్నంలో తమతో కలిసి రావాలని ఆర్య సమాజ్ ట్రస్ట్ ఛైర్మన్ అరుణ్ చౌదరి తనను ప్రోత్సహించారని ఆమె చెప్పారు. ‘ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. తల్లిదండ్రుల్లో ప్రేరణ కల్పించి మరింత మందిని చేర్చుతామనే నమ్మకంతో ఉన్నాం’ అని ఆమె చెప్పారు. ఈ పిల్లలతో కలిసి పనిచేయడం సవాళ్లతో కూడుకున్నదని ఆమె అంగీకరించారు. ‘ఈ ప్రాంతంలోని స్థానికులను కలిసి పిల్లలను పాఠశాలకు పంపమని అడిగితే వారు తొలుత విముఖత ప్రదర్శించారు.. కానీ, చివరకు తమ పిల్లలను కొంతమంది పంపడానికి అంగీకరించారు’ అని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.