టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అండగా నిలవాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం నుంచి మండలస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలని తిరుపతి,చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు జి. నరసింహయాదవ్, పులివర్తి నాని కోరారు. రేణిగుంట పాత చెక్‌పోస్టు వద్ద వున్న వై కన్వెన్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ విస్తృత సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించిన చంద్రబాబును అరెస్టు చేయడం అన్యాయమన్నారు.ఇందుకు నిరసనగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బుధవారం నుంచి మండల, నియోజకవర్గ స్థాయుల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని కోరారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసేవరకు ఈ ఆందోళనలను గ్రామస్థాయికి విస్తరింప జేసే విధంగా నాయకులు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న అరాచకాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. టీడీపీ నిర్వహించే ఆందోళనలతో జగన్‌కు వణుకు పుట్టాలన్నారు. రాష్ట్రంలో ఉన్న పోలీసుల సంఖ్య 50 వేలు మాత్రమేనని,70 లక్షలమంది తెలుగుదేశం కుటుంబసభ్యులు మూకుమ్మడిగా జైల్‌భరో నిర్వహిస్తే ఏం చేయగలరని ప్రశ్నించారు. ఎంతమందిని అరెస్టు చేస్తారు ,ఎన్ని రోజులు గృహనిర్బంధాల్లో వుంచగలుగుతారో చూద్దామని తెలిపారు.