తెలంగాణ నుంచి ఏలూరు వైపు కోళ్ళ వ్యర్థాలను తరలిస్తున్న ఐషర్ వ్యాన్‌ను ముసునూరు పోలీసులు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్ళితే.... ఏలూరు మండలం శ్రీపర్రు గ్రామానికి చెందిన బుగ్గల శ్రీనివాస్ తన వాహనంతో తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి కోళ్ళ వ్యర్థాలను చేపల చెరువులకు అక్రమంగా తరలిస్తున్నాడన్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి సుమారు ఐదు టన్నుల కోళ్ళ వ్యర్థాలను శ్రీపర్రు గ్రామానికి చెందిన బోయిన రాజు చేపల చెరువుకు సోమవారం రాత్రి తరలిస్తున్న క్రమంలో ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామంలో అదుపుతప్పి వాహనం పల్టీ కొట్టడంతో వాహనం నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని, లోపూడి అడవిలో కోళ్ళ వ్యర్థాలను పూడ్చివేసి, డ్రైవర్ ఓలేటి శ్రీనాగసాయి, వ్యాన్ యాజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కుటుంబరావు తెలిపారు.