ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైయస్ జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు.