మహిళల దుస్తులను లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచార యత్నమేనని సర్వోన్నతన న్యాయస్థానం తేల్చిచెప్పింది. గతంలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారయత్నం కేసులోఅలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బట్టలు లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచారం కిందకు రాదంటూ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి విచారణ జరిపి.. నిందితులకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. నవంబరు 2021లో యూపీలోని కస్‌గంజ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ నుంచి తల్లీకూతుళ్లు తిరిగొస్తుండగా మార్గమధ్యంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తారసపడ్డారు. బైక్‌పై ఆ బాలికను ఇంటి దగ్గర దింపుతామని చెప్పడంతో ఆమె వారి వెంట పంపింది. కానీ, తోవలో ఆ చిన్నారిని అసభ్యంగా తాకుతూ ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆ బాలిక కేకలు వేసింది. ఆమె అరుపులు విని అటుగా వెళ్తున్నవారు అక్కడకు రావడంతో నిందితులు పరారయ్యారు. తర్వాత ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది.
అయితే, ఈ కేసులో మార్చి 17 2025 అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వివాదాస్పద తీర్పు ఇచ్చారు. మహిళ వక్షోజాలను తాకడం, వారి దుస్తులు లాగినంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేమంటూ నిందితులపై ఉన్న కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో సుప్రీంకోర్టు ఈ అంశంపై తీవ్రంగా స్పందించి, సుమోటాగా విచారణ చేపట్టింది. బుధవారం నాటి విచారణలోసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడి త్రిసభ్య ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది.
ఇటువంటి తీర్పులతో సమాజానికి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు అమానవీయంగా ఉన్నాయని గత విచారణలో విచారం వ్యక్తంచేసింది. ఆ తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీచేసింది. ఈ క్రమంలోనే బుధవారం తీర్పు వెలువడింది. ఇటువంటి చర్యలు అత్యాచారం కిందకే వస్తాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
మహిళలపై లైంగిక నేరాలకు సంబంధించి సున్నితమైన కేసుల్లో న్యాయమూర్తులు సున్నితంగా వ్యవహరించాలని సీనియర్ న్యాయవాది హెచ్ ఎస్ ఫూల్కా చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘ కోర్టును ఆశ్రయించే పిటిషనర్ ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తే ఏ న్యాయమూర్తి లేదా ఏ కోర్టు తీర్పు కూడా పూర్తి న్యాయం చేస్తుందని ఆశించలేం’’ అని పేర్కొంది. ‘‘తీర్పులు ఇచ్చే సమయంలో కేవలం రాజ్యాంగ, న్యాయ సూత్రాలపైనే ఆధారపడకుండా.. కరుణ, దయ వంటి వాతావరణాన్ని ప్రోత్సహించాలని, ఈ రెండు మూల స్తంభాలు లేకుంటే న్యాయవ్యవస్థలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేవు’’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
‘‘సాధారణ పౌరులు అనుసరించే నియమాలను నిర్ణయించడం నుంచి ఏదైనా కేసులో తుది తీర్పు ఇచ్చే వరకూ.. న్యాయ ప్రక్రియలో భాగస్వాములుగా మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో మానవత్వం, జాలి, కరుణ, అవగాహన అనే విలువలు ప్రతిబింబించాలి.. న్యాయవ్యవస్థ పారదర్శకంగా, సమర్ధవంతంగా ఉండాలంటే ఈ విలువలు ముఖ్యం’’ అని తేల్చిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa