మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ విమాన ప్రమాద మృతి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనంగా మారింది. జనవరి 28వ తేదీన బారామతి విమానాశ్రయంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై అటు కుటుంబ సభ్యులు, ఇటు పార్టీ శ్రేణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన కుమారుడు జయ్ పవార్ ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బ్లాక్ బాక్స్ అంత తేలిగ్గా నాశనం కాదు..!
సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను పంచుకున్న జయ్ పవార్.. విమాన ప్రమాదాల దర్యాప్తులో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సాధారణంగా విమాన ప్రమాదాల్లో బ్లాక్ బాక్స్‌లు అంత సులభంగా నాశనం కావు. ప్రజలందరికీ పూర్తి స్థాయిలో, పారదర్శకమైన నిజం తెలిసే హక్కు ఉంది" అని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల తీరుపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేస్తూ.. ఈ కేసులో పారదర్శకత ఉండాలని ఆయన కోరారు.
అజిత్ పవార్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసింది. ఈ బృందంలో ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే, పార్థ్ పవార్ వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఎన్సీపీ లేవనెత్తిన ప్రధాన అనుమానాలు..
విమానం బయలుదేరే చివరి నిమిషంలో క్రూ సిబ్బందిని మార్చడంపై ఎన్సీపీ అనుమానంవ్యక్తం చేస్తోంది. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, విమానానికి మధ్య జరిగిన సంభాషణల్లో ఏమాత్రం పొంతన లేదని చెబుతోంది. అలాగే విమానంలోని సేఫ్టీ వార్నింగ్ సిస్టమ్స్ ఎందుకు పని చేయలేదని అడుగుతున్నారు. విమాన సంస్థ 'వీఎస్ఆర్ వెంచర్స్' నిర్వహణపై గతంలోనే ఆరోపణలు ఉన్నాయని, ఆ సంస్థపై తక్షణమే నిషేధం విధించాలని జయ్ పవార్ డిమాండ్ చేశారు.
హత్య కేసుగా నమోదు చేయాలి..
మరోవైపు ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఈ వ్యవహారంపై మరింత ఘాటుగా స్పందించారు. ఇది కేవలం ప్రమాదం కాదని.. దీనిని నేరపూరిత నరహత్యగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, డీజీసీఏ ఉన్నతాధికారుల తీరును తప్పుపడుతూ.. వారు తమ పదవుల నుంచి తప్పుకోవాలని కోరారు. విమానయాన రంగం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున, రాష్ట్ర సీఐడీ దీనిని సమర్థవంతంగా దర్యాప్తు చేయలేదని.. అందుకే సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారు. ప్రస్తుతం డీజీసీఏ, ఏఏఐబీ అధికారులు విచారణ జరుపుతున్నప్పటికీ.. బాధితుల కుటుంబం అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa