తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తుతో వెళ్తాయని పవన్ కళ్యాణ్ చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదని.. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్న భావన ప్రజల్లో ఉందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎవరు ఏకమైనా రానున్న ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు రాజ్యాధికారం అంటూ జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్.. చివరకు కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ కాళ్ల వద్ద తాకట్టుపెట్టారని విమర్శించారు. పవన్ వ్యవహారశైలిపై కాపు సామాజిక వర్గం ఆలోచించాలని కోరారు. 2014లో టీడీపీ, జనసేన పార్టీలకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లతో వైయస్ఆర్ సీపీకి లబ్ధి కలగకూడదన్న లక్ష్యంతో పొత్తు లేకుండా పోటీ చేశారని తెలిపారు. ఈ రోజు కూడా కేవలం వైయస్ఆర్ సీపీని ఓడించాలన్న ఆలోచనతోనే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయని అన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు దోపిడీ పాలన చేశారని మండిపడ్డారు.