మనిషి పుట్టుక నుంచి మరణం దాకా సాగే ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు.. ఎత్తుపల్లాలు ఎదురవుతాయి. జీవితంలో కష్టసుఖాలు, కలిమిలేములు సహజం. మనిషి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నిన్న మొన్నటి వరకూ చెన్నై వీధుల్లో బిచ్చమెత్తుకున్ని జీవనం సాగించిన వృద్ధురాలు.. ప్రస్తుతం ఇంగ్లీష్ ట్యూటర్‌గా మారిపోయింది. బిచ్చగత్తెను ఇంగ్లీష్ టీచర్‌గా మార్చిన ఘనత మొహమ్మద్ ఆషిక్ అనే కంటెంట్ క్రియేటర్‌కు దక్కుతుంది.
కంటెంట్ క్రియేటర్ మొహమ్మద్ ఆషిక్.. చెన్నై వీధుల్లో బిచ్చమెత్తుకుంటోన్న ఒక వృద్ధురాలు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె గురించి ఆరా తీయగా.. తన పేరు మెర్లిన్ అని ఆ వృద్ధురాలు చెప్పింది. తనది మయన్మార్ (ఒకప్పటి బర్మా) అని.. అక్కడ గణితం, ఇంగ్లీష్ పాఠాలు బోధించే టీచర్‌గా పనిచేశానని, భారతీయ వ్యక్తితో వివాహం తర్వాత చెన్నై వచ్చేశానని ఆమె వెల్లడించారు. దురదృష్టవశాత్తూ తన కుటుంబసభ్యులందరూ చనిపోవడంతో ఒంటరిదాన్ని కావడం వల్ల మరో దిక్కులేక బిక్షమెత్తుకుని జీవిస్తున్నానని తన దీనగాథను వివరించింది.
మెర్లిన్ కన్నీటి గాథను విని చలించిపోయిన ఆషిక్.. ఆమెకు సాయం చేయాలని భావించి వినూత్నంగా ఆలోచించాడు. ఆమెను ఆన్‌లైన ఇంగ్లీష్ టీచర్‌గా తీర్చిదిద్ది తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంగ్లీష్ విత్ మార్లిన్ పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. ఆమెకు ఓ కొత్త చీరను బహుమతిగా ఇచ్చాడు. ఇన్‌స్టాలో తన ఫాలోవర్లకు ఆమె ఇంగ్లీష్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు 5.67 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్ ట్యూటర్‌గా పాఠాలు చెబుతూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.