మహారాష్ట్రలోని నందూర్బర్ జిల్లా సివిల్ ఆస్పత్రిలో మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణాలు నమోదుకావడం కలకలం రేగుతోంది. ప్రభుత్వ డేటా ప్రకారం.. జులైలో 75 మంది, ఆగస్టులో 86, సెప్టెంబరులో ఇప్పటి వరకూ 18 మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలకు పోషకాహారలోపమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. నందూర్బర్ జిల్లా మెడికల్ ఆఫీసర్ సావన్ కుమార్ మాట్లాడుతూ.. ‘డేటాను పరిశీలిస్తే జులైలో 75, ఆగస్టులో 86, సెప్టెంబరులో 18 మంది చిన్నారులు చనిపోయారు.. ఈ మరణాలకు ప్రధాన కారణాలు బరువు తక్కువతో పుట్టడం, బర్త్ అసెక్సియా (ఊపిరితిత్తుల లోపం), సెప్సిస్, శ్వాసకోశ వ్యాధులు’ అని తెలిపారు.
మొత్తం మరణాల్లో అప్పుడే పుట్టిన శిశువు నుంచి నాలుగు వారాల్లోపువారు 71 శాతం ఉన్నారు.. నందూర్బర్ జిల్లాలోని రెండు తాలూకాల్లోనే కనీసం 60 శాతం మరణాలు నమోదయ్యాయి.. గ్రామాలకు ఏడాది మొత్తం కనెక్టివిటీ లేకపోవడం, రోడ్ల సమస్య, అంబులెన్స్ ఈ ప్రాంతాల్లోకి వెళ్లలేకపోవడమే మరణాలకు ప్రధాన కారణం. నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్య వల్ల రోగికి సంబంధించిన సమాచారం ఆలస్యంగా అందుతుంది.. రోగి ఆసుపత్రికి చేరుకోవడంలో జాప్యం జరుగుతోంది. చాలా మంది మహిళలకు రక్తహీనత ఉంటుంది.. దీని ఫలితంగా ప్రసవ సమయంలో సమస్యలు వస్తాయి’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్ అన్నారు.
సమస్య పరిష్కారం గురించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ‘మరణాల సంఖ్యను తగ్గించడానికి మేము మిషన్ లక్ష్య పేరుతో 84 రోజుల కార్యాచరణ ప్రారంభించాం.. ఈ మిషన్‌లో భాగంగా ANCని 42 రోజులు, PNCని 42 రోజుల పాటు ప్రతిరోజూ సందర్శించి పర్యవేక్షిస్తాం... ఈ కార్యాచరణతో మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తాం.. ఫలితాలు రెండు-మూడు నెలల్లో కనిపిస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.