ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్రం నుంచి 10మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అమెరికా వెళ్లారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఈ నెల 16 నుంచి నిర్వహించే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు ఎంపికయ్యారు. 8 మంది బాలికలు, ఇద్దరు బాలురతో ఈ బృందం అమెరికాలో పర్యటిస్తోంది. 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆదివారం కొలంబియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో పాల్గొన్నారు. విద్యార్థుల వెంట సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు ఉన్నారు. ఇక్కడి సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్‌లోని విద్యా విభాగం డైరెక్టర్ రాధికా అయ్యంగార్ ఆధ్వర్యంలో ‘ఎడ్యుకేట్ ఎ చైల్డ్’ లెక్చర్ నిర్వహించారు.
ఏపీ విద్యార్థులు పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, మోతుకూరి చంద్రలేఖ, గుండుమోగుల గణేష్, దడాల జ్యోత్స్న, మాల శివలింగమ్మ, సి రాజేశ్వరి, వంజివాకు యోగేశ్వర్, సామల మనస్విని,షేక్ అమ్మాజాన్‌లు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకాలను వివరించారు. ప్రధానంగా ఏపీలో విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న పాఠ్యపుస్తకాలు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, టాబ్లెట్‌లు, ఇంగ్లీష్ మీడియం, మిగిలిన సంస్కరణలతో విద్యారంగం ఎలా మారిందో.. తాము ఎలా ప్రగతి సాధించామో వివరించారు.
ప్రధానంగా మనబడి నాడు–నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాల ద్వారా పేద విద్యార్థులకు ఎంత మేలు జరుగుతోందో ప్రధానంగా వివరించారు. ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవాలన్న ఆకాంక్ష తమకు ఉందన్నారు. యూఎన్‌ఓ గ్లోబల్ స్కూల్స్ ప్రోగ్రామ్ ఎక్సట్రనల్ అఫైర్స్ అధికారి అమెండా అబ్రూమ్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ జెఫ్రీ డి సాచ్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యరు.
ఏపీలో విద్యా విధానాలు, బోధనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎఫ్‌పీ స్క్రీన్లు, ట్యాబ్స్, నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రతిభ గలవారికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఎకో అంబాసిడర్స్ వర్క్‌షాప్‌లో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈనెల 20న జర్నలిస్ట్ అండ్ రైటర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని జాన్ జే కాలేజ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్‌లో జరిగే ఎస్‌డీఎస్ సర్వీస్ సదస్సులో పాల్గొంటారని యూఎన్‌వో స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ తెలిపారు.
2023 పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 103 మంది అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఎంపికైన 30 మందికి కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్షించి 10 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఒకరు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలోని ఎకనావిుక్, సోషల్ కౌన్సిల్ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ వున్నవ షకిన్‌కుమార్ సమన్వయంతో ఏపీ ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa