తన ఎదుగుదలను చూసి చాలా మంది ఓర్వలేకపోతున్నారని, తాను చాలా చిన్నవాడ్ని అని భావిస్తున్నారని భారత సంతతికి చెందిన అమెరికన్ వివేక్ రామస్వామి అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆయన గట్టిపోటీ ఇస్తున్నారు. ప్రైమరీ డిబేట్లలో వివేక్ రామస్వామి.. తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. వివేక్ రామస్వామికి రోజు రోజుకూ మద్దతు పెరుగుతున్నట్టు పలు ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఆగస్టు నుంచి ఆయన పాపులారిటీ ఏకంగా 12 శాతం పెరిగినట్టు తాజా సర్వేలో వెల్లడయ్యింది.
ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘షానన్‌లో జరిగిన రెండో డిబెట్‌లో నా ప్రదర్శనకు స్పందన వచ్చినప్పటి నుంచి గత కొన్ని వారాలుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు... ఇది ఎన్నికల ప్రక్రియలో భాగం కాబట్టి నేను బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్నాను.. వాస్తవమేమిటంటే నా ఎదుగుదలను చాలా మంది ఓర్వలేకపోతున్నారు.. నేను చాలా చిన్నవాడ్ని అని.. 38 ఏళ్ల వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండటం వారికి మనస్కరించడం లేదు.. వాస్తవం ఏమిటంటే అమెరికా స్వాతంత్య్ర డిక్లరేషన్ రాసినప్పటికి థామస్ జఫర్సన్ వయసు 33 ఏళ్లు.. ఆ వయసులోనే ఆయన స్వివెల్ కుర్చీని కూడా కనుగొన్నారు’అని వివేక్ నొక్కి చెప్పారు.
ఆ స్ఫూర్తిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని రామస్వామి వ్యాఖ్యానించారు. ‘నా జీవితంలో ఇంకా మంచి రోజులున్నాయని నేను నమ్ముతున్నాను... అమెరికా కూడా ఇంకా మంచి రోజులను చూడగలదని నేను నమ్ముతున్నాను.. కానీ మనం ఏదో ఒకదాని వెంట పరుగులు తీయలేం’ అని వివేక్ వ్యాఖ్యానించారు. ‘నేను నిజానికి అతివాది బైడెన్ ఎజెండాను అంతగా విమర్శించను ఎందుకంటే దానిపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది సరైన ప్రదేశం కాదు. వాస్తవానికి, విమర్శించడానికి చాలా ఉంది. మనం దేని గురించి పరుగెడుతున్నాం.. మనకంటూ ఓ సొంత విజన్ ఉండాలి.. మెరిటోక్రసీని పునరుద్ధరించడం, శ్రేష్ఠతను సాధించడం, ఆర్థిక వృద్ధి, స్వేచ్ఛా ప్రసంగం, బహిరంగ చర్చ. ఇవి చాలా మంది అమెరికన్లు ఇప్పటికీ అంగీకరించే ప్రాథమిక విలువలు’ అని ఆయన చెప్పారు. ‘అందుకే 1980 నాటి రోనాల్డ్ రీగన్ శైలి, నైతికతను అందించడానికి మాకు అవకాశం ఉందని నేను బలంగా విశ్వసిస్తున్నాను.. ఆ విధంగా మేము ఈ దేశాన్ని ఒక్కటి చేస్తాం.. నేను ఈ రేసులో ముందున్నాను.. ఎందుకంటే నేను నేనే.. నా ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులు చేసే విమర్శలను స్వీకరించినప్పటికీ నేను వారిలో ఎవరికీ వ్యతిరేకంగా పోటీ చేయడం లేదు. నేను ఈ దేశం కోసం పోటీ పడుతున్నాను. అదే మన లక్ష్యాన్ని మార్గనిర్దేశం చేస్తాయి’ అని రామస్వామి వ్యాఖ్యానించారు.