ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ చంద్రబాబు పాలన కారణంగానే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. అడ్డూఅదుపూ లేకుండా అవినీతి, స్కామ్‌లకు పాల్పడి చంద్రబాబు ఈరోజున 6 లక్షల కోట్లకు అధిపతి అయ్యారు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తనపై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా చంద్రబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిడ్‌లో పేర్కొనడాన్నిబట్టి ఆయన క్రిమినల్ నేపధ్యాన్ని అర్ధం చేసుకోవచ్చని అన్నారు. రాజకీయాలలో వెన్నుపోట్లు అనేవి చంద్రబాబుతోనే మొదలయ్యాయి. టీడీపితో పొత్తు పెట్టుకున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పాల్పడిన కోట్లాది రూపాయల స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసులో నిందితుడిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆయను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రాధమిక ఆధారాలు ఉన్నట్లుగా నిర్ధారించకున్న తర్వాతే కోర్టు చంద్రబాబుకు జుడిషియల్ కస్టడీ విధించింది. దీనిపై ఒకవైపు న్యాయప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు చంద్రబాబు అరెస్టుపై అఖిలపక్ష సమావేశంలో టిడిపి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలతో యాగీ చేయడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలియజేసారు.