నంది నాటకోత్సవ అవార్డుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టి.వి., నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి స్పష్టం చేశారు. అవార్డుల ఎంపికలో సిఫారసులకు తావులేదని, ఆశ్రిత పక్షపాతానికి చోటివ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించామని వివరించారు. విజయవాడ బస్టాండ్ ఆవరణలోని ఆర్టీసీ సమావేశ మందిరంలో పోసాని కార్యక్రమం నిర్వహించారు. 22వ నంది నాటకోత్సవంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో ఎంపికైన నాటకాల వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నాటకాల ఎంపికలో జ్యూరీ సభ్యులదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు. జ్యూరీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నాటక ప్రదర్శనలు తిలకించారని, అర్హత ఉన్న నాటకాలనే ఎంపిక చేయడం జరిగిందని పోసాని పేర్కొన్నారు. ఈ విషయంలో జ్యూరీ మెంబర్లపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తాను కనీసం ఒక్కరి పేరును కూడా ప్రతిపాదించలేదని వివరణ ఇచ్చారు. ఎంపిక విషయంలో జ్యూరీ సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, సీల్డ్ కవర్లలోని పేర్లను జ్యూరీ సభ్యులే చదివారని తెలిపారు.