టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సీఐ కార్యాలయానికి వచ్చారు. గత నెలలో గన్నవరంలో నిర్వహించిన నారా లోకేశ్ యువగళం బహిరంగ సభలో సీఎం జగన్‌పై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు చేయడంతో ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు మూడు వారాల క్రితం విశాఖ విమానాశ్రయానికి వెళ్లి అయ్యన్నను అదుపులోకి తీసుకుని జీపులో కొంతదూరం తీసుకెళ్లిన తర్వాత 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు.
నోటీసులు అందడంతో బుధవారం ఆయన సీఐ కార్యాలయంలో విచారణకు హాజరై తన వివరణ ఇచ్చారు. అయ్యన్నపాత్రుడు వచ్చిన విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. యువగళం సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపైనా కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే అయ్యన్నపాత్రుడు పోలీసులకు ఎలాంటి వివరణ ఇచ్చారన్నది తెలియాల్సి ఉంది.
పోలీసులు అయ్యన్న పాత్రుడిపై 153a, 354A1(4), 509, 505(2),504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గన్నవరంలో ఆగస్టులో నిర్వహించిన యువగళం బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. ముఖ్యమంత్రిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత ఇటీవల అయ్యన్నపాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకోవడంతో కలకలంరేపింది. హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. బయటకు రాగానే ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే 41 A నోటీసులు ఇచ్చి వదిలేశారు.