తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదులు బుక్ చేసుకునేందేకు.. డిసెంబర్ నెలకు సంబంధించి ఆన్‌లైన్ కోటాకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. శ్రీవారి ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ఈ నెల 18 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిప్‌లో టికెట్లు పొందిన వారు 20 నుంచి 22లోపు చెల్లింపులు చేసి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైన ఊంజల్ సేవ, కళ్యాణం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఇక డిసెంబర్ నెలకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవలతో పాటు వర్చువల్ సేవా దర్శన కోటా టికెట్లను ఈ నెల 21న సాయంత్రం 3 గంటలకు విడుదల చేస్తారు. ఈ నెల 23న శ్రీవాణి, అంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు జారీ చేస్తారు. ఈ నెల 24న రూ.300 దర్శన టికెట్లు, 25న తిరుపతిలో గదుల కేటాయింపు, 26న తిరుమలలో గదుల కేటాయింపు స్లాట్లు విడుదల చేస్తారు. ఈ విషయాలను గమనించి దర్శన టికెట్లు, సేవ టికెట్లు, వసతి గదుల్ని బుక్ చేసుకోవాలని కోరింది టీటీడీ. ఈ షెడ్యూల్ ప్రకారం భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు మంగళవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.
హంస వాహనం – బ్రహ్మపద ప్రాప్తి
హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హంసవాహన సేవలో కళావైభవం
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం రాత్రి హంస వాహన సేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలు ఇచ్చాయి. ఇందులో శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నర్తన గణపతి కళారూపకం ఆకట్టుకుంది. అదేవిధంగా భృగుమహర్షి, శ్రీవారి రూపాలంకృతులతో తమిళనాడు బృందం భరతనాట్యం, శ్రీవారే దేవాది దేవుడుగా భావిస్తూ ఆడుతూ పాడుతూ చేసే తమిళనాడు పెరుమాళ్ నృత్యం, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ ప్రాంతాలలో విశేష ప్రాచుర్యంలో ఉన్న కాళీయట్టంతో కాళీయమర్ధనం, మోహినీ నృత్యం అలరించాయి. వీటితో పాటు తమిళనాడుకు చెందిన నెమలి నృత్యం, పాండిచ్చేరికి చెందిన కట్టెలపై నడుస్తూ, వృషభ పులివేషాలతో కూడిన కరకట్టం, కుత్రాల కురవంజి అనే నృత్యాలు, గోపికా వేషధారణలతో కూడిన మణిపూర్ నృత్యం, తమిళనాడు నుండి వచ్చిన కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుండి దాదాపు 300 మంది కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.