వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ్‌బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఇది జార్ఖండ్, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. వచ్చే మూడు రోజులు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంటకు 45–55, గరిష్టంగా 65 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని.. సముద్రం అలజడిగా ఉంటుందన్నారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు.
అనకాపల్లిలో 61 మిల్లీ మీటర్లు, చోడవరంలో 43.6, విశాఖపట్నం 37.8, అనకాపల్లి (A)లో 32, విజయనగరం జిల్లా వేపాడలో 29, విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో 21.2, చిత్తూరు జిల్లా కుప్పంలో 21.2, విశాఖపట్నంలో 20.2, విజయనగరం జిల్లా గంట్యాడలో 20, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 16.2, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 15.4, అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో 11.4, శ్రీకాకుళం జిల్లా మందసలో 10.8, ఏలూరు జిల్లా కైకలూరులో 10, కడప జిల్లా అట్లూరులో 10, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 10 మిల్లీ మీటర్ల వర్షపాంత నమోదైంది.
రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో వానలు కురిశాయి. రెండు రోజుల క్రితం వరకు వర్షాలు పడగా.. మళ్లీ ఎండ తీవ్రత కనిపించింది. ఉత్తరాంధ్రలో మాత్రం వానలు కురిశాయి.. మళ్లీ అల్పపీడనం ఏర్పడటంతో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.వర్షం ఇలా ఏపీలో దోబూచులాడుతోంది.. అటు ఎండ కూడా అలాగే ఉంది. మరి ఈ అల్పపీడనం ప్రభావం ఏపీపై ఎలా ఉంటుంది అన్నది చూడాలి.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమబెంగాల్ ఒడిసా తీరాల్లోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిసాలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. తెలంగాణలో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు మినహా పెద్ద వర్షాలు కురవలేదనే చెప్పాలి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని వాతావరణవాఖ శుభవార్త చెప్పింది.