"జగనన్నకు చెబుదాం" కార్యక్రమంలో వస్తున్న అర్జీలు నేరుగా స్వీకరిస్తున్నారని, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్న సంకల్పంతో జగనన్నకు చెబుదాం 1902 కాల్ సెంటర్ను సీఎం జగన్ ఏర్పాటు చేశారని, మండలాల వారీగా జేకేసీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని పరిష్కరించే వీలుంటుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం జగనన్న అనునిత్యం శ్రమిస్తున్నారని అందులో భాగంగానే గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పేద ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారని తెలిపారు. కరోనా సమయంలో వాలంటీర్ల సేవలు మరువలేనిదని వాలంటీర్లు అందరూ దేవుడితో సమానమని తెలిపారు. అలాగే సచివాలయ సిబ్బంది కూడా ప్రజలతో ప్రేమగా మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తున్నారని ప్రజాసేవ చేయడం ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉంటారని తెలిపారు.