ఉమ్మడి ప్రకాశం జిల్లా, గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలలో నవజాత శిశువు మృతిచెందింది. వివరాల్లోకి వెళ్ళితే... గిద్దలూరు మండలంలోని అంబవరం గ్రామానికి చెందిన షేక్ హసీనా పురిటినొప్పులతో రెండు రోజులక్రితం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించగా కొద్దిగా బరువు తక్కువ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తగిన మందులు వాడి గురువారం సిజీరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే శ్వాస తీసుకోవడం లేదని, ఉమ్మునీరు తాగడం వలన శ్వాస తీసుకోలేక బిడ్డ మృతిచెందిందని వైద్యులు పేర్కొన్నారు. అయితే పాప బంధువులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్నారు. రాత్రి వరకు కూడా బిడ్డ గుండె బాగా కొట్టుకొందన్నారు. ఇబ్బంది లేదని చెప్పి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి పాప మృతిచెందిందని చెప్పారన్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని, పాప బంధువులు ఆసుపత్రిలో నేలపై బైఠాయించి వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.