తెలంగాణలో గత కొన్నేళ్లుగా కోతుల బెడద ఎక్కువైంది. అడవులు తగ్గిపోవడంతో గ్రామాల్లోకి వచ్చేసిన కోతులు.. ఆహారం కోసం ఇళ్లలోకి దూరి బీభత్సం సృష్టిస్తున్నాయి. కోతుల దాడిలో ఎంతో మంది మహిళలు గాయపడి హాస్పిటల్ పాలయ్యారు. కోతుల బెడద భరించలేక చాలా గ్రామాల్లో చెట్లను నరికేయాల్సిన దుస్థితి తలెత్తింది. ఒకప్పుడు ఊళ్లలో ప్రతి ఇంట్లోనూ పండ్ల చెట్లు, కూరగాయ పాదులు ఉండేవి. కానీ కోతులు ఇళ్లలోనే తిష్ట వేస్తుండటంతో.. పల్లె ప్రజలు మనసుకు కష్టమైనా సరే వాటిని నరికేయక తప్పడం లేదు. కోతుల బాధ భరించలేక చాలా మంది రైతులు సాగు చేసే పంటలను సైతం మార్చేశారు.
కోతులను తరిమేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. కోతుల సమస్య కేవలం మనకే కాదు.. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఉంది. దీంతో కోతుల బెడదను తప్పించడానికి, తేలిగ్గా వాటిని తరిమేయడానికి డాక్టర్ సామ్రాట్ ఘోష్ అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ బాటిళ్లతో ‘నీల్ గగన్’ అనే సోనిక్ రాకెట్‌ను తయారు చేశారు. వీటి నుంచి బుల్లెట్ షాట్ల తరహాలో సౌండ్ వస్తుంది. 60 అడుగుల వరకూ ఈ ప్లాస్టిక్ బాటిళ్ల రాకెట్‌ను ప్రయోగించొచ్చు. 2017లోనే సామ్రాట్ ఘోష్ ఈ సోనిక్ రాకెట్‌ను తయారు చేశారు. ఇందుకోసం రకరకాల ప్రయోగాలు చేసిన ఆయన.. తాను తయారు చేసిన ప్రోటోటైప్స్‌ను ఆపిల్ తోటలు సాగు చేసే హిమాచల్ ప్రదేశ్ రైతులకు ఇచ్చారు. హిమాచల్ రైతులు తనకు ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే.. వాటి సాయంతో తాను రాకెట్లను తయారు చేసినట్లు ఆయన చెప్పారు.
ఘోష్ ప్రస్తుతం మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండర్ రీసెర్చ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 1992-98 మధ్య బెంగళూరులోని ఐఐఎస్‌సీ నుంచి పీహెచ్‌డీ చేసిన ఘోష్.. ఆ సమయంలో తాను చేసిన అధ్యయనం నుంచి రూపొందించిన ఫార్ములాతో కోతులను పారదొలే రాకెట్‌ను రూపొందించానని చెప్పారు. ఐఐటీ బాంబే నుంచి ఎమ్మెస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ చదివిన ఘోష్.. అమెరికా, కెనడా, జర్మనీల్లో పని చేశారు. కోతులు, పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడం కోసం గంధకం-పొటాష్‌తో కూడిన గన్‌ను రైతులు వాడుతుంటారు. వాటిని వాడే క్రమంలో చాలా మంది రైతులు గాయపడటాన్ని చూసిన ఘోష్.. ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నారు. ఆ దిశగా ప్రయోగాలు చేసి నీల్ గగన్‌ను రూపొందించారు. నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ నిర్వహించిన ఇన్నోవేషన్ ఫెయిర్‌లో గ్రాస్‌రూట్స్ నీల్ గగన్‌కు ఫస్ట్ ప్రైజ్ లభించింది. నీల్ గగన్ కోతులను పారదోలడంలో సత్ఫలితాలను ఇస్తుండటంతో ఘోష్ దానికి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.