అనంతపురం జిల్లాలో హిజ్రాలు రెచ్చిపోతున్నారు. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం వెళ్లే దారిలో కాపు కాస్తూ.. ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. మామూలుగా అయితే రోడ్డు మీద హిజ్రాలు ఆపితే వాహనాలు ఎవరూ ఆపరు. దీంతో తెలివిగా స్పీడ్ బ్రేకర్ల వద్ద కాపు కాసి వాహనదారులను అడ్డగిస్తున్నారు. ఆ తర్వాత వారి దగ్గర్నుంచి వేలలో వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నానా రభస చేస్తున్నారు. ఒక్కో వాహనదారుడి దగ్గర్నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ హిజ్రాలు రాబడుతున్నారని సమాచారం. చీరలు అమ్ముకునే వారి దగ్గర్నుంచి చీరలు కూడా లాగేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
హిజ్రాలకు తాను రూ.2500 సమర్పించుకోవాల్సి వచ్చిందని బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి చెప్పాడు. తమ దగ్గర్నుంచి బలవంతంగా డబ్బులు లాగేసుకున్నారని ఆ వ్యక్తి చెప్పడం గమనార్హం. ప్రయాణికులపై హిజ్రాల వేధింపులు ఎక్కువ కావడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతపురం జిల్లాలో హిజ్రాలు ఏదో ఒక రకంగా నిత్యం వార్తల్లో ఉంటుంటారు. 2021 జులైలో బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలో కొందరు హిజ్రాలు.. పెళ్లి బృందం వెళ్తున్న వాహనాన్ని ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వలేదనే కోపంతో రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారణ చేపట్టేలోగానే హిజ్రాలు రెచ్చిపోయారు. దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై పడుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు.
2021 జులైలోనే ఆషాఢ మాసం పండుగ సమయంలో రాయలసీమ హిజ్రాల సంఘం, బెంగళూరు హిజ్రాల సంఘానికి చెందిన హిజ్రాల మధ్య అనంతపురంలో గొడవ జరిగింది. ఇది కాస్తా కిడ్నా్ప్‌లకు దారి తీసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రెండేళ్ల క్రితం ఉరవకొండ సీఐ శేఖర్‌పై హిజ్రాలు పూల వర్షం కురిపించారు. 2021 ఆగస్టు 31న విడపనకల్లులో అనుష్క అనే హిజ్రా ఇంట్లో దొంగలు పడి 6.5 తులాల బంగారం, 4 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టి.. త్వరగా నిందితుడిని అరెస్టు చేశారు. దీనికి కృతజ్ఞతగా హిజ్రాలు సీఐపై పూలవర్షం కురిపించారు.