అవయవదానం కోసం ప్రజలు మరింత చొరవగా ముందుకు రావడం కోసం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్టాలిన్ సర్కారు ప్రకటించింది. శనివారం ‘స్టేట్ ఆర్గాన్ డొనేషన్ డే’ సందర్భంగా సీఎం స్టాలిన్ ఈ ప్రకటన చేశారు. ఆత్మీయులను కోల్పోయి... పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ.. కుటుంబసభ్యులు అందిస్తోన్న సహకారం వల్లే అవయవదానం సాధ్యం అవుతోందని స్టాలిన్ తెలిపారు.
‘ప్రమాదవశాత్తూ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన సందర్భాల్లో.. ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ మరి కొందరి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కుటుంబ సభ్యులు అవయదానానికి అంగీకరిస్తున్నారు. బాధలోనూ గొప్ప మనసు చాటుతున్న వారికి, పోతూ పోతూ.. తోటి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వారికి గౌరవ సూచికగా.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింద’ని స్టాలిన్ వెల్లడించారు.
అవయవ దాతల గౌరవార్థం ‘హానర్ వాక్’ (గౌరవ నడక) చేసేలా డాక్టర్లు, నర్సులను ప్రోత్సహిస్తున్నామని తమిళనాడు ట్రాన్స్‌ప్లాంట్ అథారిటీ మెంబర్ సెక్రటరీ డాక్టర్ ఎన్.గోపాల కృష్ణన్ తెలిపారు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో.. అవయవదానం చేసిన వ్యక్తి పార్థీవ దేహాన్ని వార్డు నుంచి మార్చురీకి తరలించే సమయంలో సీనియర్ డాక్టర్లు, నర్సులతో కూడిన 300 మంది సిబ్బంది, పేషెంట్లు.. అవయవదాత గౌరవార్థం వార్డు నుంచి నడక సాగిస్తారు. మిగతా హాస్పిటళ్లు కూడా ఇలాగే చేయాలని చెబుతున్నామని డాక్టర్ ఎన్.గోపాలకృష్ణన్ తెలిపారు. అవయవదానంలో తమిళనాడు దేశంలోనే ముందంజలో ఉంది. ఈ విషయంలో తమిళనాడుకు జాతీయ స్థాయిలో ఏటా అవార్డులొస్తున్నాయి.
ఎవరో ప్రముఖులు, ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారు పోతేనే ఇప్పటి వరకూ.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అలాంటిది లోకాన్ని వీడే సమయంలోనూ.. తోటి వ్యక్తుల ప్రాణాలను నిలబెడుతున్న వారికి ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలకడాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించాల్సిన పరిణామం. అవయవదానం చేయడానికి మరింత మంది ముందుకు రావడానికి ఇది ఉపకరిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.