సమాజంపై సినిమాల ప్రభావం అధికంగానే ఉంటుంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆ నాటి సినిమా మాధ్యమం ఎంతగానో ప్రభావితం చేసిందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో సినిమాల ప్రభావంపై బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రక్రియతో పనిలేకుండా సత్వర న్యాయాన్ని అందించే ‘సింగం’ వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు సమాజానికి హానికరమైన సందేశాన్ని పంపుతాయని, చట్టబద్ధమైన ప్రక్రియపై అసహాన్ని పేరేపిస్తాయని జస్టిస్ పటేల్ వ్యాఖ్యానించారు.
ఇండియన్ పోలీసు ఫౌండేషన్ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయ ప్రక్రియ విషయంలో ప్రజల అసహనాన్ని ప్రశ్నించారు. ‘కోర్టులు తమ పని తాము చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు.. పోలీసుల చర్యలను స్వాగతిస్తున్నారు. అత్యాచార కేసుల్లోని నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేసినప్పుడు సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడు న్యాయం జరిగిందని వారు భావిస్తారు. కానీ న్యాయం జరిగిందా..?’ అని జస్టిస్ గౌతమ్ పటేల్ ప్రశ్నించారు.
‘సినిమాల్లో న్యాయమూర్తులను చేతకానివారిగా.. పిరికివారుగా చూపిస్తారు.. పోలీసుల వారిపై దాడి చేస్తారు.. దోషులను కోర్టులు వదిలేస్తున్నాయని ఆరోపిస్తూ హీరో పోలీసు ఏకంగా న్యాయం చేస్తాడు.. ముఖ్యంగా సింగం సినిమా క్లైమాక్స్‌లో పోలీసులందరూ విలన్ పాత్రధారి రాజకీయ నేతపై తిరగబడతారు.. దాంతో అక్కడ న్యాయం జరిగినట్లు చూపించారు. కానీ అక్కడ న్యాయం జరిగిందా..? ఈ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది.. వ్యక్తి స్వేచ్ఛను హరించకూడదనే రాజ్యాంగ సూత్రమే అందుకు కారణం’ అని జస్టిస్ గౌతమ్ పటేల్ పేర్కొన్నారు. ఒకవేళ షార్ట్‌కట్‌లో వెళ్లడం అంటే చట్టబద్ధమైన పాలనను అణచివేయడమే అని జస్టిస్ పటేల్ నొక్కిచెప్పారు.
తమిళంలో సూర్య కథనాయకుడిగా నటించిన సింగం సినిమాను.. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి అదే పేరుతో అజయ్ దేవగణ్ హీరోగా హిందీలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. కాగా, పోలీసు యంత్రాంగం పనితీరులో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం గురించి కూడా జస్టిస్ గౌతమ్ పటేల్ ప్రస్తావించారు. పోలీసు శాఖలో సంస్కరణల దారితీసిన 2006 నాటి సుప్రీంకోర్టు తీర్పు వెనుక మాజీ డీజీపీ సింగ్ అవిశ్రాంత పోరాటం ఉందన్నారు. నిష్పక్షపాత, స్వతంత్ర పోలీసు వ్యవస్థ కోసం ప్రయత్నించడం.. న్యాయవ్యవస్థకు జవాబుదారీతనం మాత్రమే పోరాటం అని జస్టిస్ పటేల్ అన్నారు. అయినప్పటికీ 2006 తీర్పుపై సంకుచిత దృష్టి వల్ల ఆ అవకాశం లేకుండాపోయిందని కూడా అతను పేర్కొన్నాడు. ఈ తీర్పును అనుసరించే క్రమంలో ఒక అవకాశం తప్పిపోయిందనే స్పష్టమైన భావనను ఇది కలిగిస్తోందని జస్టిస్ పటేల్ వ్యాఖ్యానించారు.