ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్‌లో గతవారం ఇంటర్నెట్ పునరుద్దరణ,,,సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫోటోలు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 08:39 PM

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur Violence) పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. హింసాత్మక ఘటన సమయంలో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది నెలల కిందట అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. హింసాకాండ నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్‌ సేవలను గతవారం పునరుద్దరించారు. ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.


మైతీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులను కొంతమంది సాయుధులు అపహరించి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఒక అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించి... వారి వెనుక ఇద్దరు సాయుధులై ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. పొదల మధ్యలో ఆ మృతదేహాలను పడేసిన మరో ఫొటో కూడా వైరల్‌ అయ్యింది. దీంతో మణిపూర్‌లో మరోసారి పరిస్థితి గంభీరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. హత్యకు గురైన విద్యార్థులు.. మైతీ వర్గానికి చెందిన 20 ఏళ్ల ఫిజామ్ హేమ్‌జిత్, 17 ఏళ్ల లిజామ్ లింతోంగంబిగా గుర్తించినట్లు తెలిపింది.


జులై 6 నుంచి వీరిద్దరూ అదృశ్యమయ్యారు. ఆంక్షలు సడలించడంతో నీట్‌ కోచింగ్‌ నిమిత్తం ఆ అమ్మాయి తన ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పరిస్థితులు చక్కబడ్డాయని భావించిన ఆమె.. జులై 6న తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లింది. అప్పటి నుంచి ఇరువురి ఫోన్లు స్విచ్ఛాప్ అయి.. ఆచూకీ లేకుండా పోయింది. ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్‌ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్టు పోలీసులు అప్పట్లో ప్రకటించారు. ఈ క్రమంలోనే దుండగులు వారిని కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.


మరోవైపు, ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించినట్లు మణిపూర్‌ ప్రభుత్వం వెల్లడించింది. దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. ‘రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా సంస్థల సహకారంతో విద్యార్థులు అదృశ్యం.. వారిని హత్య చేసిన నేరస్థులను గుర్తించడానికి కేసును చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు.. నిందితులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు కూడా గాలింపు చర్యలు చేపట్టాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ దారుణమైన ఘటనకు ప్రతిస్పందనగా ఫిజామ్ హేమ్‌జిత్, హిజామ్ లింతోయింగంబిని కిడ్నాప్ చేసి చంపిన వారందరిపై అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రజలకు హామీ ఇస్తుంది.. న్యాయం జరిగేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఈ క్రూరమైన నేరానికి బాధ్యులెవరైనా కఠిన శిక్షను విధిస్తుంది’ అని స్పష్టం చేసింది.


కాగా, కుకీ వర్గానికి చెందిన సాయుధులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మణిపూర్‌ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నట్లు సమాచారం. మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను సడలించిన సమయంలో కూడా ఇద్దరు మహిళలపై జరిగిన అమానుషం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాధిత మహిళలను నగ్నంగా ఊరేగించిన.. సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టగా... సుప్రీంకోర్టు దీనిని సుమోటాగా స్వీకరించింది. జాతుల మధ్య ఘర్షణల సమయంలో చోటుచేసుకున్న మరో 9 హింసాత్మక ఘటనలను సీబీఐ విచారిస్తోంది. మే మొదటి వారం నుంచి మొదలైన హింసాకాండలో ఇప్పటి వరకూ 170 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. మరో 3 వేల మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పోలీసుల కాకుండా మణిపూర్‌లో 40 వేల మంది సైనికులను మోహరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa