ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుక జరగుతున్న పంక్షన్ హాల్‌లో ఈ ప్రమాదం జరిగింది. వేడుక జరుగుతున్న సమయంలోనే మంటలు చేలరేగి 100 మందికి పైగా మృతి చెందారు. మరో 150 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో కొత్త జంట కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర ఇరాక్ నెనెవెహ్ ప్రావిన్స్ అల్‌హమ్‌దానియా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెనెవెహ్ డిప్యూటీ గవర్నర్ హసన్ అల్-అల్లాక్ తెలిపిన వివరాల ప్రకారం.. వేడుకలో 1000 మందికి పైగా పాల్గొన్నారు. అయితే మంగళవారం రాత్రి 10.45 (స్థానిక కాలమానం ప్రకారం) గంటల సమయంలో ఫంక్షన్ హాల్‌లో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించి 113 మంది చనిపోయారు. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాద ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి.
పెళ్లి వేడుకలో బాణసంచా కాల్చటమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా బాణసంచా పేల్చటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పంక్షన్ హాల్‌లో సామాగ్రికి వేగంగా మంటలు అంటుకోవటంతో వేడుకలో పాల్గొన్నవారు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోయింది. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం సమాచారం అందగానే వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అక్కడికి అంబులెన్స్‌లు పంపించి క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.