ఎస్సీ పథకాలను రద్దు చేసిన వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు ప్రకటించారు. విశాఖనగరంలోని ద్వారకా నగర్‌లో గల పౌరగ్రంథాలయంలో బుధవారం మాల మహానాడు, దళితసేన సంఘాల ఆధ్వర్యంలో ఐక్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాల్తేరు పెంటారావు, అతిథిగా విచ్చేసిన కోండ్రు మురళీలు మాట్లాడుతూ... చంద్రబాబును అప్రజాస్వామ్యంగా అరెస్టు చేసిన తీరును ఖండిస్తూ మాలమహానాడు తీర్మానం చేసిందన్నారు. కోల్పోయినటువంటి 28 దళితుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించుకునేందుకు టీడీపీకి మద్దతు ఇస్తున్నామన్నారు. దళిత హక్కులను నిర్వీర్యం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. తమ ఓట్లతో అధికారంలోకి వచ్చి తమకే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. దళితులను చంపేసి పార్శిల్ చేసినటువంటి వారికి పదవులు ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి నైజాన్ని దళితులందరూ, మరీ ముఖ్యంగా మాలలంతా అర్థం చేసుకున్నారన్నారు.