విజయనగరం జిల్లాలో సాలూరు, పాచిపెంటలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళన చెందారు. ఇళ్లు, షాపింగ్‌మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, హోటల్స్‌లోతో పాటు పలు భవన సముదా యాల్లో ఉన్నవారు సైతం బటయకు పరుగులు తీశారు. కొన్ని క్షణాల పాటు భూమి కంపించినట్లుగా అందరూ నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే మళ్లీ భూమి కంపిస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందారు. మరికొంతమంది తమ సెల్‌ఫోన్లలో సామాజిక మాధ్యమాలను చెక్ చేసుకున్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా చూపిస్తున్నట్లు తెలిపారు. పాచిపెంటలో రెండు చోట్ల భూమి కంపించడంతో ప్రజలు హడలెత్తిపోయారు. గత 25 ఏళ్ల కిందట పాచిపెంటలో ఇదే విధంగా భూమి కంపించిందని వారు గుర్తుచేసుకున్నారు. దీనిపై సాలూరు తహసీల్దార్ బాలమురళీకృష్ణను వివరణ కోరగా పాచిపెంట మండలంలో అలూరు సమీపంలో ఉన్న జలపాతాల వద్ద 3.4 తీవ్రతతో భూమి కంపించినట్లుగా తమకు సమాచారం వచ్చిందన్నారు. ఆ ప్రకంపనల తీవ్రత సాలూరు పట్టణం వరకు వచ్చినట్లు తెలిపారు.