భారతదేశంలోనే నంబర్ వన్ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ పాలసీని ముగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు తన ఉద్యోగులు అంతా వారంలో కచ్చితంగా 5 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని వెల్లడించింది. ప్రస్తుతం టీసీఎస్ ఉద్యోగులు.. వారంలో 3 రోజులు మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు. ఇక్కడా వీరికి వెసులుబాటు ఉంది. కొన్ని సందర్భాల్లో రాకపోయినా ఇన్ని రోజులు నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం తప్పక అంతా ఇది ఫాలో కావాల్సిందేనని ఐటీ దిగ్గజం స్పష్టం చేసింది.
వర్క్ ఫ్రం హోం విధానానికి ముగింపు పలుకుతున్నట్లు టీసీఎస్.. తన ఉద్యోగులకు ఇంటర్నల్ కమ్యూనికేషన్‌లో (ఇ- మెయిల్ వంటివి) తెలిపింది. టీసీఎస్ .. తన ఉద్యోగులకు ఈ మేరకు చేసిన మెయిల్‌ను కోట్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది CNBC- TV18. టీసీఎస్ తాజాగా తీసుకున్న నిర్ణయం.. ఉద్యోగులకు నిరాశ కలిగించినప్పటికీ అది వారికి తెలిసిందే. కొన్ని నెలల నుంచి వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రాముఖ్యతను కంపెనీ నొక్కిచెబుతూనే ఉంది. దీంతో ఏదో ఒక రోజు వారికి 5 రోజులు ఆఫీసులకు రావాలని తెలుసు. 2022-23 ఆర్థిక సంవత్సరం వార్షిక రిపోర్ట్‌లోనూ.. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాల్సిన ఆవశ్యకత గురించి వివరించింది. 2020 మార్చి తర్వాత ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించుకున్న టీసీఎస్.. వారి అవసరం కంపెనీకి ఎలా ఉందో కూడా తెలిపింది.
కరోనా నేపథ్యంలో తొలిసారిగా ఈ ఐటీ ఉద్యోగులకు 2020 సంవత్సరంలో వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాయి దిగ్గజ సంస్థలు. మిగతా రంగాలు తీవ్రంగా ప్రభావితం అయినప్పటికీ.. ఐటీ మాత్రం ఏ మాత్రం ప్రభావితం కాలేదు. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ ఇలా దిగ్గజ సంస్థలన్నీ తమ ఉద్యోగులతో ఇంటి నుంచే పని చేయించుకున్నాయి. ఈ క్రమంలో మంచి ఫలితాల్ని కూడా రాబట్టాయి. అయితే ఇప్పుడు కొవిడ్ తగ్గుముఖం పట్టడం, కంపెనీలు ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోవడం.. ప్రాజెక్టులు పెద్దగా లేకపోవడం.. అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండటం వంటి కారణాల నడుమ ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత హైబ్రిడ్ మోడల్ (వారంలో 2 రోజులు లేదా 3 రోజులు ఇలా) తీసుకొచ్చాయి. క్రమక్రమంగా దీనిని మొత్తం ఎత్తివేస్తూ పూర్తిగా ఆఫీసులకు రప్పించేలా చేస్తున్నాయి.