‘ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య’ అంశంలో భారత్‌తో వివాదం కొనసాగుతోన్న వేళ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ‘నాజీ సైనికుడి’ అంశం తలనొప్పిగా పరిణమించింది. ఇప్పటికే దీనిపై వివాదాం చెలరేగడంతో కెనడా దిగువ సభ స్పీకర్ ఆంథోనీ రోటా పదవికి ఎసరు తెచ్చింది. తాజాగా ఈ అంశంపై కెనడా ప్రధాని ట్రూడో బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు ఇప్పటికే దౌత్య మార్గాల్లో చర్చలు జరిపారు.
ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీ ఇటీవల కెనడాలో పర్యటించిన.. ఆ దేశ పార్లమెంట్‌లో గత శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడు యారోస్లోవ్ హుంకా (98) ను కెనడా స్పీకర్ స్పీకర్ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్ రోటా స్వయంగా అతడిని పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడని కీర్తించారు. దీంతో ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు.
అయితే, హుంకా రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పక్షాన పోరాడిన ‘14వ వాఫన్ గ్రనేడియర్ డివిజన్’కు చెందిన వ్యక్తి అని ఆ తర్వాత తెలియడంతో నాలుక్కరుచుకున్నారు. దాంతో ఈ ఘటనపై ట్రూడో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. స్పీకర్ రోటా తన పదవికి రాజీనామా చేశారు. అయినా ఈ వివాదం చల్లారకపోవడంతో ట్రూడో బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘శుక్రవారం జరిగిన ఘటనకు ఈ సభ తరఫున బేషరతుగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.. ఈ విషయంలో ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఆ దేశ ప్రతినిధి బృందాన్ని దౌత్యమార్గాల ద్వారా సంప్రదించాం.. ఆ రోజున పార్లమెంట్‌కు వచ్చిన వ్యక్తిని గుర్తించడంలో ఘోర తప్పిదం జరిగింది. నాజీ పాలనలో తీవ్రంగా నష్టపోయిన వారి చేదు జ్ఞాపకాలను విస్మరించినట్లయింది’ అని ట్రూడో విచారం వ్యక్తం చేశారు.
అటు, నాజీ సైనికుడికి కెనడా పార్లమెంట్‌లో జరిగిన సత్కారంపై రష్యా తీవ్రంగా స్పందించింది. నాజీల నేరాలను గుర్తుంచుకోవాలని, అటువంటి పీడకల వంటి జ్ఞాపకాల విషయంలో అలసత్వం వహించడం అత్యంత దారుణమని మండిపడింది. ‘ఉక్రెయిన్ లక్ష్యాన్ని తప్పుదారి పట్టించేందుకు రష్యా ఈ తప్పిదాన్ని రాజకీయం చేస్తోంది. ఇది నాకు ఇబ్బందిగా ఉంది’ అని ట్రూడో ఇప్పటికే మీడియా ముందు వాపోయిన విషయం తెలిసిందే.