ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గొల్లపూడి పంచాయతీలోని స్నేహ రావూరి టవర్స్ అపార్ట్‌మెంట్‌లో శుభ్రం చేయకుండా ఉంచిన చెత్త డబ్బాలతో శుక్రవారం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.... అపార్ట్‌మెంట్లలో నివసించేవారు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఆ కక్షతో ఆ ప్రాంతానికి శానిటరీ వర్కర్స్‌ను పంపడం లేదని, ఇది ముమ్మాటికీ తప్పుడు చర్య అని మండిపడ్డారు. ప్రజారోగ్యం పాడు చేసే అధికారం మీకెవరిచ్చారని నిలదీశారు. రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాంతాన్ని మురికకూపంలా మార్చరని, చిల్లపిల్లలు, వృద్ధులు, మహిళలను మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్ బారిన పడేలా చేశారని మండిపడ్డారు. వసుంధర అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు తహసీల్దార్లు ఉన్నారని, జ్వరాలు వస్తున్నాయని వారి బంధువులు, తల్లిదండ్రులే చెబుతున్నారని తెలిపారు. వెంటనే చెత్తను తొలగించకుంటే దాన్ని తీసుకెళ్లి జాతీయ రహదారిపై లేదా పంచాయతీ కార్యాలయం ఎదుట పెట్టి నిరసన చేస్తానని హెచ్చరించారు.