ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఐఎండీ సూచనల ప్రకారం మయన్మార్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి వచ్చే 48 గంటల్లో వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు కొంకణ్ పరిసరాల్లో ఉన్న ఆవర్తనంతో దక్షిణ కొంకణ్, గోవాకు ఆనుకుని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది కూడా 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, వచ్చే నెల మూడో తేదీ నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు పెరుగుతాయన్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం ,ప్రకాశం, అన్నమయ్య, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. జలు అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కడప జిల్లా కోడూరులో 65.2 మిల్లీ మీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా నంబులిపులికుంటలో 60.4, అనంతపురం జిల్లా శింగనమలలో 60, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 56.2, అనంతపురం జిల్లా ఆత్మకూరులో 51.2, అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో 48.4, చిత్తూరు జిల్లా నగరిలో 48.4, అన్నమయ్య జిల్లా సాంబేపల్లిలో 48.4, అనంతపురం జిల్లా పామిడిలో 45.8, నంద్యాల జిల్లా అవుకులో 42.2, ఏలూరు జిల్లా నూజివీడులో 42.6, శ్రీ సత్యసాయి జిల్లా చిలముత్తూరులో 41.6, అనంతపురం జిల్లా కనేకల్‌లో 38, ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజీలో 36, ఏలూరులో 30.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా శుక్రవారం మధ్యాహ్నం తరువాత భారీ వర్షం కురిసింది. ఈ దెబ్బకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షంతో పాటుగా ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనకాపల్లిలో శుక్రవారం 45 నిమిషాలపాటు భారీ వర్షం కురిసింది. చోడవరం మండలంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నాలుగు గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. మళ్లీ సాయంత్రం ఐదు గంటలకు మొదలై కుండపోతగా వర్షం పడింది. మరోవైపు విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని ఏజెన్సీలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సీతంపేటలో సాయంత్రం ఉరుములు మెరు పులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల దెబ్బకు విద్యుత్‌కు అంతరాయం కలిగింది.