అటవీ శాఖ క్లియరెన్స్ ఇస్తేనే 2 గంటల తరువాత చిన్న పిల్లలకు నడక దారిలో అనుమతి లేదన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుంచి ఎలాంటి ముప్పు లేదని అటవీ శాఖ అధికారులు ధృవీకరిస్తేనే 12 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ ఛైర్మన్ క్యూ లైన్లను పరిశీలించారు.భక్తులకు ఆహారం, తాగునీరు , కాఫీ , టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గోగర్భం సర్కిల్ నుంచి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లను పరిశీలించారు.
పెరటాశి మాసం, సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు టీటీడీ ఛైర్మన్. క్యూ లైన్లు 4 నుంచి 5 కిలో మీటర్ల దూరం వెళ్లాయని.. ఇలాంటి భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పంతో వీఐపీ బ్రేక్ , సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు ఛైర్మన్ చెప్పారు. క్యూ లైన్లలో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని చెప్పారు . అక్టోబరు 15 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటుంటున్నామని తెలిపారు.
విపరీత మైన భక్తుల రద్దీ ఉండటంతో ఈవో, జేఈవో, సీవీఎస్వో, ఆరోగ్యం ఇతర అధికారులందరూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ క్యూలైన్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని ఛైర్మన్ చెప్పారు. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో వీరు ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా పని చేస్తున్నారని ఛైర్మన్ అభినందించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోందని.. భక్తులంతా సంయమనం పాటించి స్వామి వారిని దర్శించుకోవాలని భూమన సూరించారు. స్వామి వారి సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుందన్నారు. నారాయణవనంలోని షెడ్లు దాటి ఐదు కిలో మీటర్ల దూరం మేర భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారని.. క్యూలైన్లలో ఉన్న భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా టీటీడీ అధికార యంత్రంగం పని చేస్తుందన్నారు. వర్షంలో కూడా యాత్రికుల కోసం టీటీడీ అధికారులు, సిబ్బంది పని చేశారని.. ఇది అభినందించ తగ్గ విషయం అన్నారు.