మనదేశంలో వ్యక్తుల ఆయుషుపై తాజాగా ఓ సర్వే నివేదిక వెల్లడైంది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం (జీవిత కాలం) మెజారిటీ కేసుల్లో కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ, మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మహిళల ఆయుర్దాయం పురుషులతో పోలిస్తే ఎక్కువగా ఉంటున్నట్టు ‘యూఎన్ ఎఫ్ పీఏ ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023’ తెలిపింది. ప్రస్తుత వృద్ధాప్య జనాభా, వృద్ధుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఈ నివేదిక దృష్టి సారించింది. రాజస్థాన్, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ లో 60 ఏళ్ల మహిళల ఆయుర్దాయం అక్కడి నుంచి 20 ఏళ్లుగా ఉంటోంది. ‘‘60 ఏళ్ల వ్యక్తి మరో 18.3 ఏళ్లు సగటున జీవించొచ్చు. విడిగా మహిళల్లో అయితే 19 ఏళ్లు ఉంటే, పురుషుల్లో ఇది 17.5 ఏళ్లుగానే ఉంది’’ అని ఈ నివేదిక తెలిపింది. ఇక ఇక్కడ చెప్పుకున్న రాష్ట్రాల్లో అయితే 60 ఏళ్ల మహిళలు, ఇంకా 20 ఏళ్లకు పైనే జీవించే పరిస్థితులు నెలకొన్నాయి. 2050 నాటికి మన దేశంలో వృద్ధాప్య జనాభా రెట్టింపై, మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. 2022 నాటికి 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు 14.9 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో ఇది 10.5 శాతానికి సమానం. 2050 నాటికి వీరి సంఖ్య 20.8 శాతానికి చేరుకుంటుంది. అంటే సంఖ్యా పరంగా 34.7 కోట్ల మందికి వృద్ధ జనాభా పెరుగుతుందన్న మాట!