అంగళ్లు కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ... ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ... సుప్రీంకోర్టులో ఆరు వేరు వేరు పిటిషన్లను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. టీడీపీ నేతలు... దేవినేని ఉమా మహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు, నల్లారి కిషోర్ కుమర్ రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి... దానిలో జోక్యం చేసుకోడానికి ఏమీ లేదని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటషన్లను ధర్మాసనం కొట్టివేసింది.