మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. మంగళవారం మధ్యాహ్నం జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ చేయగా.. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కోర్టులో 17A పై సుధీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అన్ని పత్రాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. తొలుత హరీశ్ స్వాలే వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతీకారం కోసమే సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదించారు. ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమని.. ఆరోపణలు ఎప్పటివనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశంమని చెప్పారు.
హైకోర్టు తీర్పులో 17Aను తప్పుగా అన్వయించారని చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా వాదించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించిందని.. హైకోర్టు తీర్పులో మాత్రం చంద్రబాబు ఆదేశాలు.. అధికార విధుల్లో భాగంగా ఇచ్చినవే అన్నారని.. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైతే అప్పటి నుంచే 17A వర్తిస్తుందని.. నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదన్నారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని.. 2018 తర్వాత నమోదయ్యే ఎఫ్ఐఆర్‌లు అన్నింటికీ 17A వర్తిస్తుంది అన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటైందని.. సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఒప్పందాలు కూడా... కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగాయి అన్నారు.
అవినీతి నిరోధక చట్ట సవరణలో ప్రతి పదం సునిశితంగా పరిశీలించి నిర్ధారించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు మరో లాయర్ అభిషేక్ సింఘ్వీ . కేబినెట్ నిర్ణయాలకు సీఎం ఒక్కరే బాధ్యులు కాలేరని.. ఆ నిర్ణయాలు అధికార నిర్వహణలో భాగం అని కోర్టుకు విన్నవించారు. అధికార నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపై ప్రతీకార చర్యల నుంచి 17ఏ రక్షణ కల్పిస్తుందని.. యశ్వంత్ సిన్హా కేసులో కోర్టు తీర్పు ఈ కేసుకు కచ్చితంగా వర్తించి తీరుతుంది అన్నారు. ట్రాప్ కేసు తప్ప మిగిలిన 6 రకాల ఆరోపణలకు 17ఏ వర్తిస్తుందని.. 2015 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలపై ఆరోపణలు ఉన్నాయన్నారు. చట్ట సవరణ తర్వాత మరో ఏడాది కాల వ్యవధిని ఈ కేసులో చేర్చారని కోర్టుకు వివరించారు.
అయితే సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. ఈ కేసు దర్యాప్తు 2017 కంటే ముందే మొదలైందని.. అప్పుడే దీన్ని CBI పరిశీలించిందన్నారు. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారని.. తప్పు చేసింది 2015-16లో అన్నారు. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందేనని.. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారంటూ కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారని.. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయన్నారు. అలాగే అరెస్టైన తర్వాత
మూడు రోజుల్లోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారని.. ఏకంగా 2000 పేజీల పిటిషన్‌ను హైకోర్టు ముందుంచారన్నారు. దీంతో న్యాయమూర్తి బోస్ హైకోర్టు ముందు ఉంచిన డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ పిటిషన్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నామని.. ఇరుపక్షాలు అప్పుడు డాక్యుమెంట్లు అన్నీ సమర్పించాలన్నారు. కేవియట్ పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలకు మద్ధతిచ్చే డాక్యుమెంట్లు సమర్పించాలి. దర్యాప్తు ముందే ప్రారంభమైందని నిరూపించాలి అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నారని లూథ్రా ప్రస్తావించగా.. వీళ్లు కనీసం బెయిల్ అడగడం లేదు, ఏకంగా కేసును కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారని రోహత్గి అన్నారు. ఇప్పుడు చంద్రబాబును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని అడుగుతున్నారని.. బుధవారం బెయిల్ పిటిషన్ లిస్టైంది అన్నారు. అయితే బెయిల్ పిటిషన్ సంగతి చూడాలని ఈ నెల 9కి విచారణ వాయిదా వేశారు.