భూకంపం ధాటికి ఢిల్లీ దద్దరిల్లింది. బలమైన భూ ప్రకంపనలు రావడంతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. అక్టోబర్ 3 వ తేదీ(మంగళవారం) మధ్యాహ్నం దేశ రాజధానిలో ఈ భూకంపం చోటు చేసుకుంది. ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో దాదాపు ఒక నిమిషం పాటు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. భారీగా వచ్చిన భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారు బయటికి వచ్చి ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆఫీస్‌లలోని ఉద్యోగులు అందులో ఉండలేక.. వెంటనే బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లలోని ఫ్యాన్లు, గోడలు, వస్తువులు.. భూకంపం ధాటికి కదిలాయి. ఢిల్లీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను కూడా భూకంపం వణికించింది. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. అయితే ఈ భూకంపానికి సంబంధించి భూకంప కేంద్రం నేపాల్‌లో ఉన్నట్లు సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. అంతకుముందు మంగళవారం ఉదయం కూడా దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. ఆఫ్గనిస్థాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనలు రావడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అది మర్చిపోయేలోపే మరో భూకంపం వారిని భయపెట్టింది.