ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టుబడిన ఉగ్రవాదుల్లో ఇద్దరు ఇంజినీర్లు.. ఒకరు పీహెచ్‌డీ.. దర్యాప్తులో సంచలన విషయాలు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 09:11 PM

దేశంలో కొన్ని ప్రాంతాలలో ఐఎస్ ఉగ్రవాదుల కదలికలను గుర్తించి ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృత సోదాలు నిర్వహించి.. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లో పలువుర్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పట్టుబడ్డ వారిలో ముగ్గురు ఇంజనీర్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరంతా బాంబుల తయారీలో నిపుణులని నిర్థారణ అయ్యిందని చెప్పారు. ఉన్నత విద్యావంతులైన వీరిలో ఒకరు పీహెచ్‌డీ.. మరొకరేమో మైనింగ్ ఇంజనీరింగ్‌లో పట్టా అందుకున్నాడు. ఉగ్రవాదులంతా ఉన్నత విద్యావంతులేనని తెలిసి ఆశ్చర్యపోయినట్లు వివరించారు. ఈ చదువుల ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని మంచికి కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.


ఢిల్లీ, యూపీలలో సోమవారం అదుపులోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు ఢిల్లీ స్పెషల్ పోలీస్ విభాగం వెల్లడించింది. పేలుళ్ల కోసం షానవాజ్ ఆలం, రిజ్వాన్ అష్రాఫ్, మొహమ్మద్ అర్షద్ వార్సి తదితరులు వివిధ ప్రాంతాలలో రెక్కీ నిర్వహించినట్టు పేర్కొంది. వీరిలో ఝార్ఖండ్‌కు చెందిన షానవాజ్ ాఆలం.. 2016లో నాగ్‌పూర్‌ నిట్‌‌ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాడు. మైనింగ్‌ బ్లాస్ట్‌లపై తనకున్న పరిజ్ఞానాన్ని ఉగ్ర పేలుళ్లకు ఉపయోగిస్తున్నాడు. సాధారణ రసాయనాలతో మహ్మద్ షానవాజ్ ఆలం సాధారణ రసాయనాలను ఉపయోగించి క్లీన్, రిఫైన్డ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ని తయారు చేయగల ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.


సులభంగా సేకరించగలిగే రసాయనాలతో వివిధ రకాల IED మోడల్స్‌ను తయారుచేసినట్టు ఫోన్ డేటా ఆధారంగా వెల్లడయ్యింది. హైడ్రోజన్ పెరాక్సైడ్, అసిటోన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి సాధారణంగా లభించే పదార్థాలతో శక్తివంతమైనపేలుడు పదార్థాలను తయారు చేయగలడని తేలింది. వీటిని పేల్చినప్పుడు 60 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రాంతాన్ని ప్రభావితం చేయవచ్చు. గత నెల రోజులుగా ఆలం కోసం ఎన్ఐఏ గాలిస్తోంది. అంతేకాదు, అతడి గురించి ఆచూకీ చెబితే రూ.3 లక్షల పారితోషకం ఇస్తామని ప్రకటించింది.


 అర్షద్ వార్సి ప్రొఫైల్‌ కూడా పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఝార్ఖండ్‌కు చెందిన వార్సి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్.. తర్వాత ఎంబీఏ( మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్) పూర్తి చేశాడు. అతడు ప్రస్తుతం జామియా మిలియా ఇస్లామియాలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. జామియా నగర్‌లోని ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఫిజిక్స్ టీచర్‌గా కూడా పనిచేస్తున్నాడు. సైన్స్, మ్యాథమెటిక్స్‌లో హోమ్ ట్యూషన్ కూడా చెబుతాడని పోలీసు స్పెషల్ కమిషనర్ హెచ్‌జీఎస్ ధాలివాల్ చెప్పారు.


నవంబర్ 2016లో ఢిల్లీకి వచ్చిన ఆలం.. ఆగ్నేయ ఢిల్లీలోని అబుల్ ఫజల్ ఎన్‌క్లేవ్‌లో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. షాహీన్ బాగ్ వద్ద మతపరమైన ఉపన్యాసాలు వినే ఆలం.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ భావజాలంతో ప్రభావితమయ్యాడు. అదే ఏడాది మహ్మద్ రిజ్వాన్ అష్రాఫ్‌తో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. టెలిగ్రామ్, ఇతర ఛానెల్‌లలో ఇద్దరూ ISIS అనుకూల సంస్థలను అనుసరించడం ప్రారంభించారు.


వార్సీ అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో బీటెక్ చదివిన తర్వాత.. ఉన్నత విద్య కోసం 2016లో ఢిల్లీకి వచ్చి జామియా నగర్‌లో నివసించినట్లు విచారణలో వెల్లడయ్యింది. అక్కడ కొన్ని మతపరమైన కార్యక్రమాలకు హాజరైన సమయంలో ఆలంతో పరిచయం ఏర్పడింది. షానవాజ్ స్థావరంలో జిహాద్‌కు సంబంధించిన పుస్తకాలు, రసాయనాలు లభ్యమయ్యాయి. విదేశాల్లోని ఉగ్రవాదులతో అతడు నిత్యం సంప్రదింపులు జరిపినట్టు గుర్తించారు. మహమ్మద్ యూనిస్, మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి పుణేలో ఓ బైక్ దొంగతనం చేస్తుండగా షానవాజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు వారు ఉండే ఇంటిని సోదా చేయడానికి తీసుకెళుతుండగా తప్పించుకున్నాడు.


ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్ అష్రాఫ్ తండ్రి సౌదీ అరేబియాలోని ఓ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అష్రాఫ్ కూడా జెడ్డాలో పుట్టాడు. అరబిక్‌లో అలీమియాత్ (ఇంటర్‌తో సమానం) 2009లో పూర్తిచేసి.. ఘాజియాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తిచేశాడు. మతగురువుగా శిక్షణ పొంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని దాలివాల్ తెలిపారు. పశ్చిమ కనుమల్లోని రహస్య స్థావరాల కోసం రలావాసా, మహాబలేశ్వర్, గోవా, హుబ్లీ, కర్ణాటకలోని సరస్వతి వన్యప్రాణుల ప్రాంతం, ఉడిపి, కేరళ, వల్సాద్ వన్యప్రాణుల అభయారణ్యం, నల్లమల పర్వత శ్రేణులు, చందౌలీని వీరు సందర్శించినట్టు పోలీసులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com