ప్రధాని మోడీ, అమిత్ షా, రూపాలాకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు’’ అని ఆయన అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకం చేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలని కేంద్రమంత్రులను కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ కేఏ పాల్‌ను చూసి భయపడుతుందన్నారు. కేసీఆర్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 2న ప్రజాశాంతి పార్టీ సభకు జింఖానా గ్రౌండ్లో కేసీఆర్ అనుమతి ఇవ్వలేదన్నారు. మళ్ళీ కాంగ్రెస్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలో చేరబోతున్నారు కాబట్టి ప్రజాశాంతి పార్టీ సభలకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారన్నారు. మందుకొట్టి కొత్త మేనిఫెస్టో తెస్తా అంటున్నారని.. మరో 6 లక్షల కోట్లు అప్పు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.