టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఊరట లభించింది. మంత్రి రోజాపై చేసిన కామెంట్స్ కేసులో.. సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని గుంటూరు మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కండిషన్డ్ బెయిల్ మంజూరు చేశారు.ఇలాంటి నేరానికి మరోసారి పాల్పడకూడదని.. సాక్ష్యులను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయకూడదని.. దర్యాప్తు అధికారికి పూర్తిగా సహకరించాలని కోర్టు సూచించింది.
ఏపీ మంత్రి ఆర్కే రోజా గురించి అసభ్యంగా మాట్లాడారని గుంటూరుకు చెందిన మహిళా న్యాయవాది బడి మంజుల ఇచ్చిన ఫిర్యాదుతో గుంటూరు నగరంపాలెం పోలీసులు సత్యనారాయణమూర్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను సొంత ఊరు వెన్నలవారిపాలెంలో సోమవారం రాత్రి అరెస్టు చేసి మంగళవారం తెల్లవారుజామున గుంటూరు నగరంపాలెం స్టేషన్‌కు తీసుకొచ్చారు. 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాత అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మంగళవారం మధ్యాహ్నం వైద్య పరీక్షల కోసం సత్యనారాయణమూర్తిని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి సాయంత్రం మొబైల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆయనను రిమాండ్‌కు తరలించమని పీపీలు వాదనలు వినిపించారు. బండారుపై నమోదు చేసిన సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు శిక్షలు పడే అవకాశం ఉందని.. 41O నోటీసు ఇచ్చి విచారించాలని న్యాయవాదులు వాదించారు. బండారు తరఫున న్యాయవాదులు రిమాండ్ విధించవద్దని కోరారు. మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో చాలా ప్రభావం చూపుతాయని, ఆ దృష్ట్యా నిందితుడికి రిమాండ్ విధించాలని పోలీసుల తరఫున పీపీలు వాదించారు. ఇరువైపులా సుదీర్ఘంగా వాదనలు వినిపించడంతో సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. వారంలోపు మరో ఇద్దరితో రెండు జామీన్లు సమర్పించాలని సూచించారు.
మరోవైపు బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ ఆయన సోదరుడు బండారు సింహాద్రిరావు మంగళవారం హైకోర్టులో అత్యవసరంగా హెబియస్ కార్పస్ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మెజిస్ట్రేట్ ముందు మంగళవారం హాజరు పరచక ముందే రిమాండ్ రిపోర్టును పోలీసులు తమకు ఇవ్వడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రిమాండు రిపోర్టును తమకు ఎలా సమర్పించాన్నది అర్ కావడం లేదన్నారు. దీనిపై పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. పోలీసులు చట్టాలను పాటించకపోతే కోర్టులు కళ్లు మూసుకొని ఉండదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అరెస్టు విషయంలో నిబంధనలను పాటించలేదని తేలితే దర్యాప్తు అధికారి న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసులో 41ఏ కింద నోటీసు ఇస్తూనే సమాంతరంగా అరెస్టు చేసినట్లు తేలితే.. సుప్రీంకోర్టు అర్నెష్‌కుమార్ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు దర్యాప్తు అధికారి న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. నోటీసుపై సంతకం బండారుదేనని తేలినా దర్యాప్తు అధికారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు. అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 5కు వాయిదా వేసింది.